ఆదిలాబాద్, జనవరి 24(నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వానకాలంలో పత్తి, సోయా పంటలు అధిక వర్షాలతో నష్టపోగా.. మిగిలిన పంటలను విక్రయించగా పెట్టుబడి రాని పరిస్థితి నెలకొన్నది. యాసంగి సాగు చేసి నష్టాన్ని పూడ్చుకుందామనుకుంటున్న రైతులు పెట్టుబడి కోసం అప్పులు చేస్తున్నారు. ప్రభుత్వం యాసంగికి రైతుభరోసా ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో 1.46 లక్షల మంది రైతులు ఉండగా.. రైతు భరోసా కింద రూ.280 కోట్ల సాయం ప్రభుత్వం రైతులకు అందించాలి. సంక్రాంత్రి పండుగకు రైతు భరోసా అందుతుందని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. సోయా కొనుగోళ్లు ముగియగా.. పత్తి కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. రెండు పంటలు తీసిన రైతులు యాసంగి సాగు చేస్తున్నారు. జిల్లాలో ఈ సీజన్లో జొన్న, శనగ, మక్క, ఇతర పంటలు అధికంగా సాగు చేస్తారు.
యాసంగి ప్రారంభమై నెల రోజులు దాటింది. పంటలు వేసే సమయం దాటితే దిగుబడిపై ప్రభావం ఉంటుందనే భయంతో రైతులు పెట్టుబడి కోసం అప్పు చేస్తున్నారు. వానకాలం పంటలను నష్టపోయిన రైతుల చేతిలో డబ్బులు లేకపోవడంతో అధిక వడ్డీలకు అప్పులు తెస్తున్నారు. వానకాలంలో అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రభుత్వం నుంచి సాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎకరాకు రూ.10 వేల సాయం అందిస్తామని ప్రకటించినా ఫలితం లేకపోయింది. ఐదు నెలలు గడిచినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సాయంపై రైతులు ఆశలు వదులుకున్నారు. రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం సకాలంలో పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు.
నాకు నాలుగెకరాల భూమి ఉంది. వానకాలంలో మక్క, సోయా సాగు చేయగా భారీ వర్షాల కారణంగా నష్టపోయా. 20 క్వింటాళ్ల మక్క, 10 క్వింటాళ్ల సోయా దిగుబడులు వచ్చాయి. దీంతో పెట్టుబడి కూడా రాలేదు. యాసంగిలో నాలుగు ఎకరాల్లో జొన్న, మక్క వేశా. రైతు భరోసా రాకపోవడంతో ప్రైవేటు వ్యాపారుల వద్ద రూ.70 వేలు బాకీ తీసుకొని సాగు చేస్తున్నా. యాసంగికి పైసలు లేకపోవడంతో సాగు నెల రోజులు ఆలస్యమైంది. సర్కారు నిర్ణయాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కోసం యాప్లో తీసుకోవాలని అంటున్నారు. మా వంటి రైతులకు యాప్ గురించి ఏమి తెలుస్తది. యాప్ ద్వారా నాకు రెండు సంచుల యూరియా మాత్రమే దొరికింది. ఇది ఎందుకు సరిపోదు. రైతులు అడిగినన్ని బస్తాలు ఇవ్వాలి.
– బండారి ప్రవీణ్, రైతు, కజ్జర్ల, తలమడుగు
వానకాలంలో పదెకరాల్లో పత్తి వేయగా.. భారీ వర్షాల వల్ల ఐదెకరాల పంట వరద నీటిలో కొట్టుకుపోయింది. కాంగ్రెస్ నాయకు లు గ్రామంలో పర్యటించి నష్టపోయిన పంటలను పరిశీలించారు. ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తామని మాటిచ్చారు. అధికారులు గ్రామాలకు వచ్చి నష్టం వివరాలు రాసుకున్నారు. ఐదు నెలలు దాటినా ప్రభుత్వం నుంచి ఒక్క పైసా సాయం అంద లేదు. చేతికొచ్చిన పంటలు వరదపాలు కావడంతో భారీగా నష్టం వాటిల్లింది. యాసంగి సాగు కోసం అప్పు చేయాల్సి వస్తున్నది. నేను ఏడెకరాల్లో జొన్న సాగు చేస్తున్నా. రైతు భరోసా ఇప్పుడు, అప్పుడు అంటూ ప్రభుత్వం ఆలస్యం చేస్తున్నది. రైతులకు అవసరమైన సమయంలో వస్తే అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన తిప్పలు ఉండవు.
– శార్ధా సతీశ్, రైతు, కజ్జర్ల, తలమడుగు