జైనథ్, మే 27 : ‘ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని పరిస్థితి ఉన్నది.. మార్కెట్ యార్డులో ఇబ్బంది పడుతున్నం..సారూ.. జొన్నలు కొనుండ్రి’ అంటూ ఆదిలాబాద్ కలెక్టర్కు మేడిగూడకు చెందిన రైతు క్యాతం రామిరెడ్డితో పాటు పలువురు రైతులు విన్నవించారు. బుధవారం సాత్నాల మండలంలోని మేడిగూడ గ్రామంలో ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అకాల వర్షాల దృష్ట్యా జొన్నల కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్కు రైతులు విన్నవించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెంట వెంటనే కొనుగోళ్లు చేపట్టి గోదాములకు తరలించాలని, డబ్బుల చెల్లింపులు త్వరగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఎదులాపురం, మే 27 : జిల్లాలో జొన్నల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం నుంచి జొన్నల కొనుగోళ్లు, రవాణా ఏర్పాట్లపై ఆయన సంబంధిత అధికారులతో అత్యవసర గూగుల్ మీట్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ చిత్రు, మార్ఫెడ్ డీఎం మహేశ్ కుమార్, జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్, మారెటింగ్, రవాణా, ఇతర అధికారులు పాల్గొన్నారు.