మంచిర్యాల, ఆగస్టు 17 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ తమకు వర్తించకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. రాస్తారోకోలు.. ర్యాలీలు నిర్వహించారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు.
తలమడుగు మండలం కేంద్రంలో 500 మంది రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను డప్పులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శవయాత్ర నిర్వహించి చెప్పులతో కొట్టారు. అనంతరం దహనం చేశారు. బోథ్‌లో రైతులు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. భీంపూర్‌లో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు.
బోథ్ మండల కేంద్రంలో నిరసన ర్యాలీ తీసి నిర్మల్ రహదారిపై రాస్తారోకో చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. తాంసి, గిమ్మలో రైతులు ఆందోళన చేపట్టారు. రుణమాఫీ జాబితాలో పేర్లు లేకపోవడంపై నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని వ్యవసాయశాఖ కార్యాలయానికి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రుణమాఫీ ఎందుకు కాలేదని ఏఈవోలను నిలదీశారు.
జైనథ్ మండలం కేంద్రంలో జరిగిన రాస్తారోకోలో బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ రోడ్డుపై బైఠాయించి రైతులకు మద్దతు ప్రకటించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ పేరిట రైతులను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. కేవలం 40 శాతం మంది రైతులకు నామ్‌కే వాస్తేగా రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రూ. 2 లక్షల రుణాలను మాఫీ చేయాలన్నారు.
ప్రభుత్వం అర్హులైన రైతుల పంట రుణాలు మాఫీ చేసే వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు తెలిపారు. జైనథ్‌లోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బీవోఎం మేనేజర్ శివ ప్రసాద్‌ను రుణమాఫీ కాలేదని రైతులు నిలదీశారు. బ్యాంకు అధికారులు రుణ డేటా తప్పుల తడకగా ఉందని, తమకు న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్ ఎదుట రైతులు రాస్తారోకో చేశారు.
పోలీసు, వ్యవసాయ అధికారులు సముదాయించినా వినలేదు. కలెక్టర్‌తో ఫోన్లో రైతులతో మాట్లాడించారు. ఆదిలాబాద్ ట్రెయినీ అభిజ్ఞాన్ మాలవియా జైనథ్ బ్యాంక్ అధికారులతో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ధర్నా రాస్తారోకోను విరమించారు. జైనథ్‌లో బోరజ్ జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. మహారాష్ట్ర, తెలంగాణ మధ్య రాకపోకలకు 40 నిమిషాల పాటు అంతరాయం కలిగింది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన రైతులు అర్హులకు రుణమాఫీ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి పుల్లయ్య రైతుల వివరాలను ప్రభుత్వానికి అందజేస్తామని సూచించడంతో రైతులు ఆందోళన విరమించారు.
రుణ మాఫీ కోసం రోడ్డెక్కిన రైతులు
నెన్నెల,ఆగస్టు17 : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ. 2 లక్షల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో రైతులు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని సీఎం వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు సింగతి రాంచందర్ డిమాండ్ చేశారు. రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం, వందలాది మంది రైతులకు అన్యాయం చేసిందని మండిపడ్డారు. రూ. 20 వేల రుణం మాఫీ కాని రైతులు కూడా ఉన్నారని, ప్రభుత్వం మాత్రం అందరికీ రుణమాఫీ చేశామంటూ గొప్పలు చెప్పుకుంటుందన్నారు.
రైతులు ఖరీఫ్ పంటలు వేసి మూడు నెలలు గడుస్తున్నా రైతు భరోసా ఇవ్వలేదని మండిపడ్డారు. రుణమాఫీ కాని రైతులకు ఎలాంటి షరతులు లేకుండా వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. పీఏసీఎస్ చైర్మన్ మేకల మల్లేశ్, నాయకులు ప్రతాప్‌రెడ్డి, ఇబ్రహీం, అశోక్‌గౌడ్, మొండన్న, పాపయ్య, కొడిపే శంకర్, మాజీ సర్పంచ్‌లు శంకర్, బాపు, తోట మధు, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
గిరిజనేతర రైతుల నిరసన కవ్వాల్ జీపీ ఎదుట ఒకరి ఆత్మహత్యాయత్నం
జన్నారం, కవ్వాల్ 17 : రుణమాఫీ కాలేదంటూ గిరిజనేతర రైతులు పురుగుల మందు డబ్బాతో నిరసనకు దిగిన ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ గ్రామంలో శనివారం జరిగింది. రైతులు కుమ్మరి మల్లయ్య, జక్కుల లచ్చన్న, మైమూద్ అలీఖాన్, గుమ్ముల సత్తన్నలతో పాటు 75 మంది గిరిజనేతర రైతులు రుణమాఫీ కాలేదంటూ పురుగుల మందు డబ్బాతో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు.
గొల్ల లచ్చన్న పురుగుల మందు తాగేందుకు యత్నించగా, పక్కనే ఉన్న గుడ్ల బుచ్చన్న అనే రైతు మందు డబ్బాను బలవంతంగా లాగేసుకున్నాడు. శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రుణాలు మాఫీ చేయాలని, లేదంటే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై కవ్వాల్ క్లస్టర్ విస్తరణాధికారి సయ్యద్ అక్రమూల్లాను వివరణ కోరగా.. రుణమాఫీ కాని వారికోసం సర్వే చేస్తున్నామని, అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.