పెంబి, డిసెంబర్ 4: నిర్మల్ జిల్లా పెంబి మండలం మందపల్లి గ్రామంలో చేపడుతున్న కస్తూర్బాగాంధీ విద్యాలయ భవన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బాలికల విద్యాభివృద్ధికి ప్రాధన్యమిస్తూ ప్రతి మండలంలో కేజీవీలను ఏర్పాటు చేసింది. బాలికలు మధ్యలోనే చదువు మానేయకుండా, డ్రాప్ అవుట్‌ను తగ్గించేందుకు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థినులకు మెరుగైన విద్యను అందించడానికి కస్తూర్బా విద్యాలయాలు దోహదపడుతున్నాయి. నూతనంగా ఏర్పడిన పెంబి మండలంలోని మందపల్లిలో 2017లో ప్రభుత్వం కేజీబీవీని ప్రారంభించింది. ప్రస్తుతం అద్దె భవనంలో పాఠశాల కొనసాగుతున్నది. శాశ్వత భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 3.5 కోట్లు మంజూరు చేసి పనులు చేపడుతున్నది. ఇప్పటికి 80 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం కేజీబీవీలో 186 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. అద్దె భవనంలో పూర్తి స్థాయిలో వసతులు లేకపోవడంతో విద్యార్థినులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. భవన నిర్మాణంతో సమస్యలు తొలగిపోనున్నాయి. రెండు నెలల్లో అన్ని సౌకర్యాలతో భవన నిర్మాణం పూర్తికానుండడంతో ఉపాధ్యాయు లు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విద్యారంగానికి ప్రాధాన్యత
సీఎం కేసీఆర్ విద్యారంగానికి ప్రాధాన్యమిస్తున్నారు. మందపల్లిలో కేజీబీవీ ఏర్పాటు చేయడంతో పేద విద్యార్థినులకు మెరుగైన విద్య అందుతుంది. పాఠశాలలో సకల సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకొని రూ.3.5 కోట్లతో నూతన భవన నిర్మాణం చేపట్టడం సంతోషంగా ఉంది. భవన నిర్మాణంతో విద్యార్థినులు, ఉపాద్యాయుల సమస్యలు తొలగిపోనున్నాయి.
-చెర్పూరి సుధాకర్, సర్పంచ్, మందపల్లి
సీఎం కేసీఆర్‌తోనే కేజీబీవీ
మారుమూల గిరిజన మండలంలో కేజీవీవీ ఏర్పాటుకు కారణం సీఎం కేసీఆరే. కేజీ టు పీజీ అమలులో భాగంగా ప్రభుత్వం కొత్త మండలాల్లో కేజీబీవీలను ప్రారంభించి బాలికలకు మెరుగైన విద్యనందిస్తుంది. మందపల్లిలో ఏర్పాటు చేసిన కేజీబీవీ పేద విద్యార్థినులకు ఎంతో ఉపయోగపడుతుంది. సకల సౌకర్యాలతో భవన నిర్మాణం చేపడుతుండడంతో విద్యార్థినుల, ఉపాధ్యాయుల సమస్యలు తొలగిపోనున్నాయి. భవన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. త్వరలో పాఠశాల కొత్త భవనం ప్రారంభం కానుంది.
-బైరెడ్డి గంగారెడ్డి, వైస్ ఎంపీపీ, మందపల్లి