కాగజ్‌నగర్, జూలై 31: ప్రభుత్వ దవాఖానలో రోగులకు బాధ్యతాయుతంగా వైద్య సేవలందించాలని వైద్యులు, సిబ్బందిని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. కాగజ్‌నగర్ పట్టణంలోని ఎల్లాగౌడ్ తోట ప్రాంతంలోని సామాజిక 30 పడకల ప్రభుత్వ దవాఖానను అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు. ల్యాబ్, రక్త నిల్వలు, రిజిష్టర్లు, మందుల రికార్డులు, పరిసరాలను పరిశీలించారు.
వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. దవాఖాన ఎదుట బురదమయమైన రోడ్డుకు మరమ్మతులు చేయాలని మున్సిపల్ డీఈ రమాదేవిని ఆదేశించారు. సిర్పూర్(టీ), బెజ్జూర్ సామాజిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పూర్తి స్థాయి సౌకర్యాలతో మెరుగైన వైద్య సేవలందించేలా తీసుకుంటామన్నారు. వైద్యులు, సిబ్బంది ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
అనంతరం కాగజ్‌నగర్ మండలంలోని బసంత్‌నగర్‌లో కడక్ నాథ్ అమిత్ మండల్ కోళ్ల పెంపకం కేంద్రాన్ని సందర్శించారు. మహిళా శక్తి కింద చేపట్టనున్న కోళ్ల పెంపకం కేంద్రాన్ని పరిశీలించారు. మహిళా శక్తి పథకం కోసం వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అర్హులకు కోళ్ల పెంపకం యూనిట్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో ఆయన వెంట డీఎంహెచ్‌వో తుకారాం భట్, ఆర్డీవో రమేశ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో సీతారాం, మెడికల్ ఆఫీసర్ చెన్నవేశవ, తదితరులు పాల్గొన్నారు.
మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించేందుకు చర్యలు
ఆసిఫాబాద్ టౌన్, జూలై 31: అంగన్వాడీ కేంద్రాల ద్వారా మెనూ ప్రకారం పోషకాహారం సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకుంటామని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా సంక్షేమ శాఖ అధికారి భాసర్‌తో కలిసి అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, పిల్లలకు పౌష్టికాహారం అవసరమైన మందులను అందించడంపై యూనిసెఫ్ ప్రతినిధులు, పోషణ్ అభియాన్ సమన్వయకర్తలు, ఆహార విభాగం సమన్వయకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందిస్తున్నామని, పిల్లల శారీరక, మానసిక ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తూ అవసరమైన మందులు అందిస్తున్నామని తెలిపారు. గిరిజన ప్రాంతంలోని పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో యూనిసెఫ్ ప్రతినిధులు ఖ్యాతి తివారి, రేషా దేశాయ్, నరసింహారావు, పోషణ్ అభియాన్ సమన్వయకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
గిరిజన విద్యార్థిని మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి
-కలెక్టర్‌కు విద్యార్థి సంఘాల నాయకుల వినతి
ఆసిఫాబాద్ టౌన్, జూలై 31: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల డిగ్రీ కళాశాలలో అనారోగ్యంతో విద్యార్థిని మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం వివిధ విద్యార్థి సంఘాల నాయకులు కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రేను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని గిరిజన గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో డిగ్రీ విద్యార్థిని కుమ్రం లక్ష్మి కళాశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రెండు రోజుల క్రితం జ్వరంతో మృతి చెందిందని ఆరోపించారు.
పది రోజులుగా జ్వరంతో ఇబ్బంది పడుతుంటే అకడ పని చేస్తున్న సిబ్బంది పారాసిటమల్ గోలీలు ఇచ్చి సరిపెట్టారని, మెరుగైన వైద్యం అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినిని ఇంటికి పంపించాలని తల్లిదండ్రులు కోరినా పంపించలేదన్నా రు. విద్యార్థిని ఆరోగ్యం విషమించిన తర్వాత తల్లిదండ్రులకు అప్పాజెప్పారని, అదే రోజు రాత్రి విద్యార్థిని ఆరోగ్యం క్షీణించి మృతి చెందిందని తెలిపారు.
విద్యార్థిని మృతికి కారణమైన ప్రిన్సిపాల్, ఏఎన్ఎం, వార్డెన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. విద్యార్థిని కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు. జిల్లాలో అన్ని వసతి గృహాల్లో మెనూ ప్రకారం భోజనం అందించాలని, వైద్య శిబిరాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గెడం టీకనంద్, గొడిసెల కార్తిక్, టీఏజీఎస్ జిల్లా అధ్యక్షురాలు. కోరంగేమాల శ్రీ, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి, దుర్గం దినకర్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.