బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మహిళాలోకం భగ్గుమంది. మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలు శనివారం సాయంత్రం ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలతో అట్టుడికాయి. రహదారులపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మలను చెప్పులతో కొట్టి దహనం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బండి డౌన్ డౌన్, బీజేపీ హఠావో నినాదాలు మారుమోగాయి. సంజయ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. బీజేపీకి, బండికి మహిళలంటే గౌరవం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్కు వస్తున్న జనాదరణను చూసి, కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక కవితను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
– ఎదులాపురం/ఉట్నూర్/దస్తురాబాద్, మార్చి 11
ఎదులాపురం/ఉట్నూర్/దస్తురాబాద్, మార్చి 11: ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో శనివారం ఆందోళనలు మిన్నంటాయి. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని తెలంగాణ చౌక్ వద్ద మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రంగినేని మనీష ఆధ్వర్యంలో బండి దిష్టిబొమ్మ, ఫ్లెక్సీని దహనం చేశారు. అనంతరం వన్‌టౌన్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఉట్నూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కందుకూరి రమేశ్ ఆధ్వర్యంలో బండి దిష్టిబొమ్మను దహనం చేశారు. కడెం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బండి దిష్టిబొమ్మను దహనం చేశారు.
Sanjay
మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాల పట్టణంలో శనివారం సాయంత్రం ఐబీ చౌరస్తా నుంచి ఓవర్‌బ్రిడ్జి వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు పల్లపు తిరుపతి, మహిళా విభాగం అధ్యక్షురాలు గరిగంటి సరోజ, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ వసుంధర, ఐసీడీఎస్ మాజీ ఆర్గనైజర్ అత్తి సరోజ ఆధ్వర్యంలో సంజయ్ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దహనం చేశారు. మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌లో సీఐ రాజుకు బీఆర్ఎస్ మహిళలు వినతిపత్రం అందించారు. చెన్నూర్ పోలీస్‌స్టేషన్‌లో బీఆర్ఎస్ నాయకులు సీఐ ప్రవీణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. మందమర్రి పట్టణంలోని బీఆర్ఎస్ బీ-1 కార్యాలయం సమీపంలో కోల్‌బెల్ట్ రహదారిపై బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
సుమారు గంటపాటు ఆందోళన కొనసాగడంతో రోడ్డుకు ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచాయి. బండి సంజయ్ విధానాలకు వ్యతిరేకంగా మహిళా నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు శెట్టి సాజన్ ఆధ్వర్యంలో మహిళా కౌన్సిలర్లు, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వేర్వేరుగా బండి సంజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అంతకుముందు కాంటా చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. సంజయ్ దిష్టిబొమ్మను మహిళలు చెప్పులతో కొట్టి బీజేపీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. జన్నారం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గుర్రం రాజారాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి సులువ జనార్దన్ ఆధ్వర్యంలో ప్రధాన రోడ్డుపై ధర్నా చేపట్టి బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
బీజేపీకి మహిళలంటే గౌరవం లేదు..
ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. బీజేపీకి, సంజయ్‌కు మహిళలంటే గౌర వం లేదని పేర్కొన్నారు. కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన కుమార్తెను ఇబ్బందుల పాలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మహిళాలోకాన్ని అవమానపరిచేలా మాట్లాడిన సంజయ్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అధ్యక్ష పదవి నుంచి తొలగించాలన్నారు. మోదీ, బండి డౌన్ డౌన్, బీజేపీ హఠావో అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. బండిని పిచ్చాసుపత్రికి తరలించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మారిన తర్వాత బీజేపీకి భయం పట్టుకున్నదని, దేశవ్యాప్తంగా వస్తున్న జనాదరణ చూసి తట్టుకోలేక ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. సంజయ్ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
14
క్షమాపణ చెప్పాల్సిందే..
బండి వ్యాఖ్యలు బాధాకరం. ఇది ఆయన దిగజారుడు తనానికి నిదర్శనం. వెంటనే క్షమాపణ చెప్పాల్సిందే. లేకపోతే ఆందోళనలు తీవ్రం చేస్తాం. బీఆర్ఎస్ ఎదుగుదలను జీర్ణించుకోలేకనే బీజేపీ నాయకులు మతితప్పి మాట్లాడుతున్నారు. బండి ప్రవర్తనను ప్రజలంతా గమనిస్తున్నారు. బీజేపీకి పోయేకాలం వచ్చింది. ప్రజలే తగిన గుణపాఠం బెబుతారు.
-రంగినేని మనీషా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్, ఆదిలాబాద్.
బండి ఇంటిని ముట్టడిస్తం
కేసీఆర్ సార్ వల్లే తెలంగాణ వచ్చింది. రాష్ర్టాన్ని మస్తు అభివృద్ధి చేసిండు. పేదోళ్లందరికీ మేలు చేస్తున్నడు. ఇవన్నీ చూసి ఓర్వలేకనే ఎంపీ బండి సంజయ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నడు. కవితక్కను అంత పెద్ద మాట అంటడా..? అస్సలు ఆడోళ్లంటే గౌరవముందా? గిసొంటోళ్లకు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతరు. ఇప్పటికైనా కవితక్కకు క్షమాపణ చెప్పాలి. లేదంటే ఆయన ఇంటిని ముట్టడిస్తం.
– రంజనాబాయి, ఖుర్షీద్‌నగర్, ఆదిలాబాద్
వెంటనే క్షమాపణ చెప్పాలి
మంచిర్యాలటౌన్, మార్చి 11 : సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం లేక ఆయన కుమార్తె కవితను ఇబ్బందులు పెడుతున్న సంగతి అందరికీ తెలిసిం దే. ఈడీ విచారణను సమర్థవంతంగా ఎదుర్కొం టున్నారని జీర్ణించుకోలేక బండి సంజయ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మహిళలతో పెట్టుకుంటే మసైపోతావు. బీఆర్ఎస్ను ఎదుర్కోలేక కవితపై తప్పుడు ఆరోపణలు చేస్తూ మీ జేబు సంస్థలతో ఇబ్బందులు పెడుతున్నారు. మహిళ అనికూడా చూడకుండా నీచపు మాటలు మాట్లాడావు. వెంటనే క్షమాపణ చెప్పాలి. లేదంటే సరైన రీతిలో బీజేపీకి బుద్ధిచెబుతాం.
– ఎం వసుంధర, మున్సిపల్ మాజీ చైర్మన్, మంచిర్యాల