ఎదులాపురం, అక్టోబర్ 3 : చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా నిర్వహించుకునే దసరా(విజయదశమి) వేడుకలు గురువారం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఊరూరా ఘనంగా జరిగాయి. తొమ్మిది రోజుల పాటు దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేసి భక్తులు.. దశమి రోజున దసరా పండుగను కనుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాలు, దుర్గామండపాల వద్ద ప్రత్యేక పూజలు చేసి, రామ్‌లీలా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దస్నాపూర్ మైదానంలో హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రామ్‌లీలా కార్యక్రమంలో భాగంగా రావణాసురుడి బొమ్మను దహనం చేశారు. కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ కార్యక్రమ ముఖ్య అతిథులుగా వేడుకల్లో పాల్గొన్నారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి అని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. గురువారం రాత్రి ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ మైదానంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో దసరా వేడుకలు నిర్వహించారు. రావణాసురుడి బొమ్మ ను దహనం చేశారు. ఈ సందర్భంగా నాగపూర్ ఆరెస్ట్రా బృంద కళాకారుల భక్తి పాటలు, నృత్యాలు అలరించా యి. ఆదిలాబాద్ కాంగ్రెస్ నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి, సామాజిక కార్యకర్త ముడుపు మౌనీష్ రెడ్డి , సనాతన హిందూ ఉత్సవ సమితి నాయకులు ప్రమోద్ కుమార్ ఖత్రి , నర్సాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
విజయ దశమిని పురసరించుకుని ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ఆయుధ పూజను ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపి వేడుకలను ప్రారంభించారు. డిపార్ట్మెంట్లోని వాహనాలకు పూజలు చేశారు. శ్రీరామచంద్రుడు, దుర్గాదేవిల పోరాట స్ఫూర్తితో దోపిడీ, దౌర్జన్యాలకు పాల్పడే అసాంఘిక శక్తులపై పోలీసులు అలుపెరగకుండా శ్రమిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్, ఆర్ఐలు, డాగ్, బాంబ్ స్వాడ్ టీమ్‌లు, మోటార్ ట్రాన్స్‌పోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా క్యాంపు కార్యాలయంలో ఆయుధాలు, వాహనాలకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సలోని, సిబ్బంది యాసిన్, సందేశ్ పాల్గొన్నారు.
నేరడిగొండ, అక్టోబర్ 2 : నేరడిగొండలో ఎమ్మెల్యే జాదవ్ అనిల్ తన నివాసంలో వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మండల కేంద్రంలో రావణ దహన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
నిర్మల్ అర్బన్/ఖానాపూర్, అక్టోబర్ 3: నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్‌పేట్‌లో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో దసరా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రావణాసుర బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమాల్లో బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ డా.జానకీషర్మిల, ప్రముఖవక్త అప్పాల ప్రసాద్, విశ్వహిందూ పరిషత్ ముఖ్యులు పార్థసారథి, మూర్తి ప్రభాకర్, వివిధ పార్టీల నాయకులు, పట్టణ వాసులు పాల్గొన్నారు.
ఖానాపూర్ పట్టణంలోని శ్రీరాంనగర్, విద్యానగర్, తిమ్మాపూర్ కాలనీలో జరిగిన దసరా ఉత్సవాల్లో గురువారం రాత్రి ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ స్థానిక నాయకులతో కలిసి శమిపూజలో పాల్గొన్నారు.