నిర్మల్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతీ సీజన్లో ఠంచన్‌గా అందే రైతుబంధు పథకం నిధులతో రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పంటలను సాగు చేసుకునే వారు. ప్రతి వానకాలం, యాసంగి సీజన్లకు గాను ఎకరానికి రూ.10వేల చొప్పున కేసీఆర్ ప్రభుత్వం నిర్ధేశిత గడువులోగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. పెట్టుబడికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. రైతు బంధు నిధులు అందక..అటు బ్యాంకులు సహకరించక..ఇటు ప్రభుత్వం కనికరించకపోవడంతో అన్నదాతలు మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పులు తెచ్చి పంటలు సాగు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం మూలంగా పెట్టుబడికి ఇబ్బంది పడుతున్న రైతులంతా మాజీ సీఎం కేసీఆర్‌ను తలచుకుంటున్నారు. కేసీఆర్ హయాంలో సకాలంలో పెట్టుబడి సాయం అందించి దేవుడిలా ఆదుకున్నాడని గుర్తు చేసుకుంటున్నారు. వానకాలం సీజన్‌కు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈ యాసంగి సీజన్‌కైనా రైతు భరోసా సాయాన్ని అందిస్తుందో లేదో నన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా యాసంగి పంటల సాగుకోసం అన్నదాతలు తమ భూములను సిద్ధం చేశారు. కొన్ని చోట్ల ఇప్పటికే ఆరుతడి పంటలైన మక్క, జొన్న, శనగ తదితర పంటలను వేశారు. వరి పంటను సాగు చేసే రైతులు నారుమళ్లను సిద్ధం చేసి దుక్కులు దున్ని పెట్టారు. వచ్చే వారం పది రోజుల్లో బోరుబావుల కింద వరినాట్లు సైతం మొదలు కానున్నాయి. యాసంగి పంటల ప్రణాళికను సైతం వ్యవసాయాధికారులు ఇప్పటికే విడుదల చేశారు. అధికారుల అంచనా ప్రకారం ఈ యాసంగిలో 3 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు వేయనున్నారు. ఇందులో 1,10,000 ఎకరాల్లో వరి, 1,02,000 ఎకరాల్లో మక్క, 35వేల ఎకరాల్లో జొన్న, 55 వేల ఎకరాల్లో శనగ తదితర పంటలు సాగవుతాయని అంచనా వేశారు. అన్ని రకాల పంటలకు విత్తనాలతో పాటు యూరియా 37వేల మెట్రిక్ టన్నులు, డీఏపీ 8 వేల మెట్రిక్ టన్నులు, 20-20, ఇతర ఎరువులు 14వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కానీ పెట్టుబడి సాయం అందక సాగు పనుల కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో ఠంచన్‌గా…
రాష్ట్రంలోని రైతులు ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేసేందుకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో గత కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చింది. ఏటా రెండు సార్లు ఎకరాకు రూ.5వేల చొప్పున పంట పెట్టుబడి సాయం డబ్బులను రైతుల బ్యాంకు ఖాతాల్లో ఠంచన్‌గా జమ చేసింది. గత కేసీఆర్ ప్రభుత్వం 2018 నుంచి 2023 వానకాలం సీజన్ వరకు 11 విడుతల్లో జిల్లా రైతులకు మొత్తం రూ.2,163 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందించింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు స్థానంలో రైతు భరోసాను అమలు చేసి ప్రతి రైతుకూ ఏటా ఎకరాకు రూ.15వేల సాయం చేస్తామని హామీ ఇచ్చింది. కౌలు రైతుకు సైతం ఈ పథకాన్ని వర్తింపజేస్తామని వాగ్ధానం చేసింది. అది కూడా 2023 డిసెంబర్ 9న ఇస్తామని ప్రకటించింది. ఇది జరిగి ఏడాదైనా నేటికీ రైతు భరోసా అమలు కాలేదు. కేసీఆర్ ఇచ్చిన రైతు బంధును కూడా ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టింది. వానకాలం సీజన్‌కు సంబంధించి జిల్లాలోని 1,88,317 మంది రైతులకు ఇవ్వాల్సిన రూ.228 కోట్ల పెట్టుబడి సాయాన్ని ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టింది. ఈ పరిస్థితుల్లో రైతులు కేసీఆర్ ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
ఈ యాసంగిలోనైనా సాయం అందేనా…?
ఈ యాసంగికి రైతు భరోసా డబ్బులను ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ రైతుల్లో నమ్మకం కలగడం లేదు. ఇప్పటికే రెండు సీజన్లలో ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసిన కాంగ్రెస్ సర్కారుపై రైతులు మండిపడుతున్నారు. గత వానకాలం సీజన్లో అనేక సాకులు చెప్పి పంట పెట్టుబడికి నిధులు విడుదల చేయలేదు. రైతు భరోసా అమలు కోసం కొత్త నిబంధనలు రూపొందించాలని, అర్హులకే ఇవ్వాలని, అవకతవకలు అంటూ వట్టి మాటలు చెప్పి రైతులను మభ్యపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మంత్రి వర్గ ఉప సంఘం కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నది. కనీసం ఈ సీజన్లో నైనా వస్తాయా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒక వేళ ఇచ్చినా ఎంత మందికి ఇస్తారు..? ఎంత మందికి కోత పెడుతారో అనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతున్నది. మరోవైపు చేతిలో పెట్టుబడి సాయం లేకపోవడంతో రైతులు వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి పంటలు సాగు చేస్తున్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీ మేరకు ఈ యాసంగికి రైతు భరోసా కింద పంట పెట్టుబడి సాయాన్ని అందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.