బెల్లంపల్లి, జనవరి 18 : బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హెచ్చరించారు. ఇటీవల జరిగిన దాడిలో గాయపడి బెల్లంపల్లి వంద పడకల దవాఖానలో చికిత్స పొందుతున్న కన్నెపల్లి మండలం వీగాం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సోషల్ మీడియా నాయకుడు జిల్లపల్లి విఘ్నేష్ను శనివారం ఆయన పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి భరోసానిచ్చారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యలకు సూచించారు.
మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏడాదిగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షలతో దాడులకు పాల్పడడం సిగ్గు చేటన్నారు. దాడులు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అధికారులు కూడా వారికే వంతపాడుతూ దాడులను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందని, అధైర్యపడవద్దని స్పష్టం చేశారు.
ఏడాది పాలనలో బెల్లంపల్లిలో జరిగిన అభివృద్ధి శూన్యమని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకే రిబ్బన్ కట్ చేసి ప్రారంభిస్తున్నారని చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీలు అమలు కాకపోవడంతో ప్రజలు కేసీఆర్ను తలుచుకుంటున్నారని గుర్తు చేశారు. మహాలక్ష్మి పథకంతో ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.