బెల్లంపల్లి, జూలై 31 : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్దే హవా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పష్టం చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశానికి మాజీ జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, మాజీ ఎంపీపీ, బుగ్గ ఆలయ మాజీ చైర్పర్సన్ మాసాడి శ్రీదేవి శ్రీరాములుతో కలసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని, మరో 20 ఏండ్లు రాష్ట్రంలో అధికారంలో ఉండేది తమ పార్టీయేనని స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్కు ప్రజలు ఓటు వేసే పరిస్థితి లేదన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ మరోసారి ప్రజలను బురిడి కొట్టించేందుకు పక్కా ప్రణాళికతో వస్తున్నదని, ఆ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఎద్దేవా చేశారు. రేవంత్రెడ్డి సమైక్యాంధ్ర కీలుబొమ్మ అని, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుణం తీర్చుకుం టున్నారని విమర్శించారు. చంద్రబాబు కనుసన్నల్లోనే రేవంత్రెడ్డి పనిచేస్తున్నారని, తెలంగాణ రాష్ర్టానికి నష్టం కలిగించేలా సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్లపై అనుచితంగా విరుచుకుపడుతున్న రేవంత్రెడ్డి తన హోదాకు తగ్గట్లు మాట్లడడం లేదని, ఈ విషయమై ప్రజలు విస్తృతంగా చర్చించుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో కమిటీలు వేసి గ్రామ గ్రామాన సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్, బీజేపీలు కాలయాపన చేస్తున్నాయని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీలకు 42 శాతం పైబడి రిజర్వేషన్ ఇచ్చామని గుర్తు చేశారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో నాలుగు బీసీ, రెండు ఓసీ, ఒకటి ఎస్టీకి కేటాయించినట్లు గుర్తు చేశారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో కూడా 23 మంది బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చినట్లు వెల్లడించారు. మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి బెల్లంపల్లిలో 34 వార్డుల్లో 26 మంది కౌన్సిలర్లను గెలిపించిన ఘనత తనకే దక్కుతుందన్నారు.
కొందరు గోడమీద పిల్లులు మాత్రమే కాంగ్రెస్ పార్టీలోనికి వెళ్లారని, నిఖార్సైన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందేందుకు పోలీసు, ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించుకుంటుందని, దానికి ప్రతిగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమష్టి కృషితో పనిచేసి ఎన్నికల్లో విజయబావుటా ఎగరేవేయాలని పిలుపునిచ్చారు. టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ సభ్యుడు వెంకటర మణ, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్, నాయకులు సత్యనారాయ ణ,విజయ్, తాళ్లపల్లి మల్లయ్య, లక్ష్మణ్, అరుణ్, పుల్లూరి మౌనిక్, వినోద్, అలీ తదితరులు పాల్గొన్నారు.