కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : సీజన్కంటే ముందే పల్లెల్లో నకిలీ విత్తనాల దందా మొదలైంది. మూడు రోజుల క్రితం చింతలమానేపల్లిలో రూ.10.50 లక్షల విలువ చేసే 3 క్వింటాళ్లు పట్టుబడడం ఇందుకు బలం చేకూరుస్తున్నది. వానకాలం ప్రారంభం కావడానికి రెండు నెలల ముందు నుంచే అక్రమ వ్యాపారం ప్రారంభించడం ఆందోళన కలిగిస్తున్నది.
పేరు.. ఊరు లేని కంపెనీల్లో తయారైన విత్తనాల ప్యాకెట్లను అమాయక రైతులకు అంటగట్టేందుకు వ్యాపారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తున్నది. విత్తనాల సంచులపై తయారు చేసిన తేదీ.. వ్యాలిడిటీ తదితర వివరాలేవీ ఉండడం లేదు. లైసెన్స్లు పొందిన దుకాణాదారులే వాటిని తెప్పించి గుట్టు చప్పుడు కాకుండా పల్లెల్లోకి చేరవేస్తున్నట్లు సమాచారమున్నది.
ఏపీ, మహారాష్ట్ర నుంచి..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోకి ఏపీ, మహారాష్ట్రలోని పలు జిల్లాల నుంచి వివిధ మార్గాల ద్వారా నకిలీ విత్తనాలు వస్తున్నాయి. జిల్లాలో ఎరువులు, విత్తనాలు అమ్మేందుకు లైనెస్స్లు పొందిన డీలర్లు 251 మంది ఉన్నారు. వీరం తా తమ దుకాణాల ద్వారా విత్తనాలు, ఎరువులు అమ్ముతున్నారు. నకిలీ విత్తనాలను లైసెన్స్ పొందిన వారే తెప్పిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఫర్టిలైజర్స్ను తనిఖీ చేస్తున్నారు. నిషేధిత విత్తనాలు, ైగ్లెసిల్లను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నారు.
మోసపోతున్న రైతులు
నకిలీ విత్తనాలు గుర్తించేలా ఉండకపోవడంతో రైతులు వాటిని కొనుగోలు చేసి మోసపోతున్నారు. సాధారణంగా బ్రాండెడ్ కంపెనీలు విక్రయించే విత్తనాలు, మందులపై వాటిని తయారు చేసిన తేదీ, ఎక్స్పైరీ తేదీ, లాట్ నంబర్లు తదితర వివరాలు ఉంటాయి. బ్రాండెడ్ కంపెనీలు తయారు చేసినట్లుగా నకిలీ విత్తనాల కంపెనీలు కూడా అదేస్థాయిలో ప్యాకెట్లను ముద్రించి మార్కెట్లోకి సరఫరా చేస్తున్నారు. కానీ, వీటిపై విత్తనాలు తయారు చేసిన తేదీ.. ఎక్స్పైరీ తేదీ.. లాట్ నంబర్ వంటి వివరాలు ఉండవు. ఏదో ఒక పేరుతో ప్యాకెట్లను తయారు చేసి సరఫరా చేస్తుంటారు.
నకిలీలపై నిఘా..
వివిధ రకాల కంపెనీల పేర్లతో నకిలీ విత్తనాలను అమాయక రైతులకు అంటగడుతున్న ముఠాలను అరికట్టే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో యేటా యథేచ్ఛగా కొనసాగుతున్న నకిలీ విత్తనాల దందా గుట్టు రట్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు.. ముఖ్యంగా జిల్లాలో లైసెన్స్ పొందిన డీలర్ల అండదండలతోనే నకిలీ విత్తనాల దందా జోరుగా సాగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాస్క్ఫోర్స్ అధికారులు నకిలీ విత్తనాల సరఫరాపై నిఘా పెంచారు. ఆసిఫాబాద్ జిల్లాకు పొరుగున్న ఉన్న రాష్ర్టాల నుంచి సరఫరా అయ్యే నకిలీ విత్తనాలపై ప్రత్యేక బృందాల ద్వారా దృష్టి పెడుతున్నారు.