నిర్మల్, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మిగ్జాం తుఫాన్ ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. చాలా చోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో చలి తీవ్రత పెరిగింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఈదురుగాలులతో చిరుజల్లులు కురుస్తున్నాయి. జిల్లాలో గురువారం కనిష్ఠ ఉష్ణోగ్రత 18 డిగ్రీలకు చేరుకోగా, గరిష్ఠ టెంపరేచర్ 22-23 డిగ్రీల మధ్యనమోదవుతున్నాయి.
ముఖ్యంగా సోన్ మండలంలోని పాక్పట్ల, నిర్మల్ రూరల్ మండలంలోని ముజ్గి, సారంగాపూర్ మండలంలోని జామ్, కుంటాల, మామడ మండలాల్లోని తాండ్ర గ్రామాల్లో గత 24 గంటల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే 15 రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందంటున్నారు. మరో రెండు రోజులపాటు తుఫాన్ ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
తుఫాన్ ప్రభావంతో పల్లెలు, పట్టణాలు, ముఖ్యంగా గిరిజన గూడేలను పొగమంచు పూర్తిగా కమ్మేసింది. దీంతో చలి తీవ్రత విపరీతంగా పెరగడమే కాకుండా, ఉదయం నుంచి రాత్రి వరకు శీతలగాలులు, కురుస్తున్న చిరుజల్లులతో ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఉదయం 10 గంటల వరకు ప్రధాన రహదారులపై దట్టమైన పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు హెడ్లైట్లు వేసుకొని వెళ్లాల్సి వస్తున్నది. గిరిజన గూడేలు, తండాల్లో చలి నుంచి కాపాడుకునేందుకు చలి మంటలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా మామడ, ఖానాపూర్, పెంబి, సారంగాపూర్ మండలాల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో గల గిరిజన గ్రామాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది.
తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న మంచు, చిరుజల్లులతో పత్తి, శనగ పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో చిరు జల్లులు కురుస్తుండడంతో పత్తి తడిసిపోతున్నది. దీంతో తడిసిన పత్తిని కొనుగోలు చేసేందుకు స్థానిక వ్యాపారులు ముందుకు రావడం లేదు. అలాగే శనగ పంటకు తేమ అధికం కావడంతో ఎర్రబారి పోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
ప్రధానంగా జిల్లాలోని ముథోల్, బాసర, తానూర్, కుభీర్, భైంసా, లోకేశ్వరం మండలాల్లో రైతులు ఎక్కువగా పత్తి, శనగ పంటలను వేస్తారు. ఆయా మండలాల్లో మూడు రోజులుగా తుఫాన్ ప్రభావంతో చిరుజల్లులతోపాటు, రాత్రి పూట విపరీతంగా మంచు కురుస్తున్నది. దీంతో పంట ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడనున్నది. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించి రైతులకు అవసరమైన సూచనలు, సలహాలిచ్చి వారిని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.