కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : జైనూర్ మండలం లొద్ది గ్రామంలో వేసవికంటే ముందే తాగునీటికి ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. దాహార్తిని తీర్చుకునేందుకు కిలోమీటర్ల కొద్ది నడిచి, చెలిమెల నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి దాపురించింది. కేసీఆర్ సర్కారులో మిషన్ భగీరథ ద్వారా ఎంచక్కా నీరు సరఫరా చేయగా, ప్రస్తుత ప్రభుత్వ పట్టింపులేని తనంతో గొంతు తడవడం లేదని గిరిజనం ఆవేదన వ్యక్తం చేస్తున్నది.
లొద్దిగూడ గ్రామంలో దాదాపు 200 కుటుంబాలు ఉంటాయి. కేసీఆర్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాలు బిగించారు. కానీ, పైపులైన్లు వేయడంలో కొన్ని సమస్యలు ఎదురుకాగా, ఇంటింటికీ నీరందించడం వీలు కాలేదు. దీంతో గ్రామంలో సోలార్ పంప్‌ను ఏర్పాటు చేసి 3 కిలోమీటర్ల దూరంలోనున్న వాగు నుంచి పైపులైన్ వేశారు. దాదాపు నాలుగేళ్లు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా నిత్యం తాగు నీరు సరఫరా చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. సోలార్ పంపుకు మరమ్మతులు చేసే నాథుడు లేక గతేడాది నుంచి నీరు సరఫరా కావడం లేదు. దీంతో గిరిజనలకు తాగు నీటి తిప్పలు మొదలయ్యాయి.
లొద్డిగూడ గ్రామ గిరిజనులు నాలుగు కిలోటర్లు అడవిలో నడిచి వెళ్లి వాగులో నుంచి చెలిమెల నీరును తెచ్చుకోవాల్సి వస్తోంది. కేవలం నీటిని తెచ్చుకునేందుకే రోజంతా పనులు వదులుకోవాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పశువులను వాగు వద్దకు తీసుకెళ్లి నీటిని పెడుతున్నారు. చెలిమెలు ఏర్పాటు చేసుకొని పశువుల దాహాన్ని తీరుస్తున్నారు. అడవిలో నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలోనున్న వాగుకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సి పరిస్థితి నెలకొంది. ఇకనైనా సర్కారు స్పందించి తాగు నీరందించేలా చూడాలని గిరిజనులు వేడుకుంటున్నారు.
జైనూర్, ఫిబ్రవరి 23 : మా ఊరిలో సోలార్ పంపుసెట్ పనిజేస్తలేదు. తాగు నీటికి అరిగోస పడుతున్నం. కాలినడకన వెళ్లి వాగులో చెలిమెలు తోడుకొని నీళ్లు తెచ్చుకుంటున్నం. ఇగ ఎండాకాలం ముదిరితే గా నీళ్లుకూడా దొరకవు. ఆఫీసర్లు చేస్తమంటున్నరుగాని.. చేసింది లేదు. కనీసం బోరు వేసి అయినా నీటి గోస తీర్చాలి.
– మెస్రం రాధాబాయి, లొద్దిగూడ
జైనూర్, ఫిబ్రవరి 23 : కొన్ని రోజులుగా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. సోలార్ పంపుకు రిపేరు చేయమని గ్రామ పంచాయతీ సార్లను అడిగితే బడ్జెట్ లేదని చెబుతున్నరు. మూడు నాలుగేళ్ల క్రితం రూ. 3 లక్షలతో అప్పటి కలెక్టర్ సార్ మాకు సోలార్ సిస్టం బిగించి.. ట్యాంక్‌ను కొనిచ్చిండు. ఇప్పుడది పనిచేయక తాగు నీటికి గోసైతంది. ఇకనైనా మా ఇబ్బందులను చూసి తాగు నీరందించాలి.
– మెస్రం రాజేశ్, లొద్దిగూడ