హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 15 : చారిత్రాత్మకమైన రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం 3:30 గంటలకు సుప్రభాతసేవ, మంగళ వాయిద్యసేవ.. ఉత్తిష్ఠ గణపతి ఆరాధన రుద్రేశ్వరునికి పాశుపత రుద్రాభిషేకం జరిపారు. ఉదయం 5 గంటల నుంచి సామూహిక రుద్రాభిషేకాలు రాత్రి 10 గంటల వరకు నిర్వర్తించారు.
శివరాత్రిని పునస్కరించుకొని తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి బారులుతీరారు. దేవాలయం నుంచి హనుమకొండ రస్తా వరకు క్యూలో నిల్చున్నారు. 5000 మంది భక్తులు స్వామివారి అభిషేకంలో పాల్గొన్నారు. ఉదయం నుంచే దేవాలయానికి లక్షలాదిమంది క్యూలైన్లో రుద్ర నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.
సాయంత్రం 5:30 గంటలకు ఉత్తరాషాడ నక్షత్రం సుముహూర్తంలో రుద్రేశ్వరీ-రుద్రేశ్వర స్వామివారి కల్యాణోత్సవం మహాగణపతి ఆరాధనతో వైభవంగా నిర్వహించారు. రుద్రేశ్వరీ-రుద్రేశ్వర స్వామివార్లను కల్యాణ వేదికపై ప్రతిష్టించిన సందర్భంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వద్దిరాజు వెంకటేశ్వర్ల దంపతులు మంగళ వాయిద్యాల మధ్య స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. యజ్ఞో పవిత్రధారణ, బాషిగాధారణ జిలకర్ర బెల్లం, పాదపూజ మహాసంకల్ప మంత్ర పఠనంతో సుముహూర్త సమయంలో మంగళ గౌరీ పూజ మాంగల్యధారణ అక్షతారోహణ పుష్పార్చన నిర్వహించారు. వద్దిరాజు వెంకటేశ్వర్ల దంపతులు, మాడిశెట్టి సాంబయ్య దంపతులు వరుడు తరఫున.. వెంకటేశ్వరరావు, వధువు పక్షాన మాడిశెట్టి సాంబయ్య దంపతులు కల్యాణకర్తలుగా వ్యవహరించారు. శివకల్యాణంలో పాల్గొన్న భక్తులను ఉద్దేశించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గారపల్లి మహేశ్వర శర్మ శివతత్వంపై ఉద్బోధించాడు.
లింగోద్భావ సమయమున మహాన్యాస పూర్వక 111 రుద్రములతో నమకచమకాదులతో 101 లీటర్ల ఆవుపాలతో 51 లీటర్ల ఆవు పెరుగుతో పుట్ట తేనెతో నెయ్యి చక్కెరతో పండ్ల రసాలతో 12 మంది వేదపండితుల ఆధ్వర్యంలో మహా రుద్రాభిషేకం రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నిర్వర్తించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి డి.అనిల్ కుమార్ ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేందర్ శర్మ, వైదిక పండితులు వైదిక కార్యక్రమాలను నిర్వర్తించారు. రుద్రేశ్వర సేవా సమితి సభ్యులు చొల్లేటి కృష్ణమాచారి, గండ్రాతి రాజు, కట్ల రాజు, సురేష్‌కుమార్, శివలింగాచారి, నవీన్కుమార్చారి విశేషమైన సేవలో భక్తులకు అందించారు. ఎన్ఎస్ఎస్ విద్యార్థులు భక్తులకు తాగునీరు అందించారు. సుధీర్‌రావు, తాడూరి రేణుకా బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శనలు, బొబోడిగ లక్ష్మీనారాయణ చేత శివపార్వతుల కల్యాణ హరికథా కాలక్షేపం నిర్వర్తించారు.
రుద్రేశ్వరస్వామి రుద్రాభిషేకంలో శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, దాస్యం వినయ్‌భాస్కర్ సతీమణి రేవతి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వారి సతీమణి నీలిమ దంపతులు, విష్ణువర్ధన్ రెడ్డి సతీమణి గోదాదేవి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, ప్రముఖ బిల్డర్ సీతారామరెడ్డి, వేముల సత్యమూర్తి, రాంరెడ్డి, ఏసీపీ నరసింహారావు, సీఐ మచ్చ శివకుమార్, ఉత్సవ అధికారి రాముల సునీత, జిల్లా న్యాయమూర్తులు, వాగ్దేవి కళాశాల చైర్మన్ చందుపట్ల దేవేందర్‌రెడ్డి, హైకోర్టు జస్టిస్ సాంబశివనాయుడు, వరంగల్ ఎంపీ కడియం కావ్య, సిటీ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, బీజేపీ హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మండువ శేషగిరిరావు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బంధువులు, స్థానిక కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, ప్రముఖ సినీ గేయ రచయిత వరంగల్ వాసి కాసర్ల శ్యామ్ పాల్గొని స్వామివారికి రుద్రాభిషేకాలు నిర్వర్తించుకున్నారు.