హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : ప్రముఖ గ్లోబల్ కమర్షియల్ రియల్ ఎస్టేట్, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ జేఎల్ఎల్ తన ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ డెలివరీ ప్లాట్ఫామ్ కోసం హైదరాబాద్లో అధునాతన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ను లాంఛనంగా ప్రారంభించింది. 1.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ జీసీసీని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రపంచస్థాయి కంపెనీల గమ్యస్థానంగా హైదరాబాద్ విరాజిల్లుతున్నదని, జేఎల్ఎల్ ఏర్పాటు చేసిన ఈ జీసీసీతో మరిన్ని ప్రపంచస్థాయి కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపే అవకాశాలున్నాయన్నారు.
గత 20 నెలల్లో రాష్ట్రంలో దాదాపు 150 జీసీసీలు ఏర్పాటైనట్టు, తద్వారా టెక్నాలజీ రంగంలో 1.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. ఏఐ, ఆటోమేషన్, ప్రపంచ పునర్వ్యవస్థీకరణ టెక్నాలజీ పరిశ్రమల ఏర్పాటుతో రేపటి తరానికి ఉద్యోగాలు సృష్టించడం ద్వారా భవిష్యత్తుకు భరోసా కల్పించేలా పనిచేస్తున్నామన్నారు. మరోవైపు జేఎల్ఎల్ బిజినెస్ సర్వీసెస్ చీఫ్ మాథ్యూరీస్ మాట్లాడుతూ..హైదరాబాద్లో నెలకొల్పిన జీసీసీలో వందలాది మంది టెక్నాలజీ నిపుణులు విధులు నిర్వహిస్తున్నట్టు, వచ్చే రెండేండ్లలో ఈ సంఖ్యను 1,600కి పెంచుకోవాలనుకుంటున్నట్టు చెప్పారు. ప్రస్తుతం సంస్థకు ఆరు దేశాల్లో 6,500 మందికి పైగా ఉద్యోగులు కలిగివున్నారు.