నిజామాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎక్సైజ్ శాఖ తీవ్ర అవినీతి ఆరోపణలతో అపకీర్తిని మూట గట్టుకుంటోంది. వరుస ఘటనలతో అల్లకల్లోలం అవుతోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో వరుసగా ఏసీబీ దాడులు, అవినీతి ఆరోపణలు వెలుగు చూస్తున్నప్పటికీ సిబ్బందిలో మార్పు కనిపించడం లేదు. నెలల వ్యవధిలోనే వీస్తూ పోయే ఘటనలు బయట పడుతున్నాయి. లంచాలకు మరిగిన కొంత మంది తీరుతో మొత్తం ఆబ్కారీ శాఖకే మాయని మచ్చ పడుతోంది. అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌గా ఎక్సైజ్ శాఖ నిలుస్తున్నప్పటికీ గాడిలో పెట్టేందుకు ఎవ్వరూ సాహసించడం లేదు.
గతంలో పని చేసిన ఉన్నతాధికారులంతా మామూళ్ల మత్తులో ఊగి తూగి అంటకాగినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. పరిపాలనపరమైన వ్యవహారాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకోలేదు. అక్రమాలపై ఉక్కుపాదం మోపలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ, ఎస్సై స్థాయి అధికారులపై కనీసం విచారణ చేయలేదు. మెమోలు, షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణలు తీసుకున్న దాఖలాలే లేవు. అవినీతిలో కూరుకుపోయిన కింది స్థాయి అధికారులను వెన్నంటి కాపాడుతూ శాఖలో అక్రమాలకు పెద్ద పీట వేశారు. ఫలితంగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం, ఆదాయానికి మించిన కేసుల్లో ఉన్నతాధికారి దొరకడం, అంతరాష్ట్ర చెక్‌పోస్టులో డబ్బులు వసూళ్లు చేయడం వంటివి వరుసగా వెలుగు చూస్తున్నాయి.
ప్రభుత్వం ఈ మధ్యనే ఎక్సైజ్ శాఖలో సమూల ప్రక్షాళన చేసింది. బదిలీలు చేపట్టి అనేక మందిని స్థాన చలనం చేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు కొత్తగా ఎక్సైజ్ డిప్యూటి కమిషనర్(డీసీ), నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఎక్సైజ్ సూపరింటెండెంట్లను నియమించింది. నెల రోజులు కావొస్తున్నప్పటికీ పరిపాలనపరంగా ఆబ్కారీ శాఖలో ఎలాంటి మార్పులు చేర్పులు జరగకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఉన్నతాధికారులు సైతం పాత వ్యవస్థకే సలాం కొడుతున్నట్లుగా ఆరోపణలు గుప్పు మంటున్నాయి. ఇదేమిటి? అని అడిగే నాథుడు లేకుండా పోవడంతో ఆడిందే ఆట… పాడిందే పాట అన్నట్లుగా అక్రమాలు రాజ్యమేలుతున్నాయి.
కల్లు మాఫియా చేస్తోన్న దురాఘాతాలను అరికట్టాల్సిన నూతన ఎక్సైజ్ అధికారులంతా రోజులు గడుస్తోన్న తమదైన శైలిలో పనితనాన్ని చూపెట్టకపోవడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో జరిగినట్లుగా “మామూళ్లు”గానే వ్యవహారాలు నడుపుతున్నట్లుగా సొంత శాఖలోని సిబ్బంది కోడై కోస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా పని చేస్తూ మల్లారెడ్డిపై ఏసీబీ కేసులు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో ఓ అవినీతి అధికారికి సంబంధించిన వసూళ్ల చిట్టా వెలుగు చూసింది. నెలకు సుమారుగా రూ.2లక్షలు నుంచి రూ.3లక్షలు చొప్పున కల్లు బట్టీల నుంచి అక్రమంగా డబ్బులు డిమాండ్ చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. కొత్తగా వచ్చిన అధికారులు ఈ దుస్థితికి చరమగీతం పాడాల్సి ఉండగా అలాంటిదేమీ లేదన్న సంకేతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్థూలంగా నవ్విపోదురుగాక నాకేంటి… అన్నట్లుగానే ఆబ్కారీ శాఖ పరిస్థితి మారింది.
పరువు తీసిన చెక్‌పోస్ట్ అక్రమాలు…
తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని కామారెడ్డి జిల్లా మద్నూర్ వద్ద గల అంతరాష్ట్ర ఆబ్కారీ చెక్‌పోస్టు వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మద్నూర్ ఎక్సైజ్ చెక్‌పోస్టు వద్ద జరుగుతోన్న అక్రమాలపై వీడియోలు తీసి రాజస్థాన్‌కు చెందిన శ్యామ్‌లాల్ అనే లారీ డ్రైవర్ తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాడు. ఇప్పటి వరకు సుమారుగా 3కోట్ల మంది ఆ వీడియోను వీక్షించడంతో పాటుగా వాట్సప్, ఇన్‌స్ట్రాగ్రామ్, ఫేస్బుక్లో లెక్కకు మించి వైరల్ అవుతోంది. ప్రతి వాణిజ్య వాహనం నుంచి డబ్బులు వసూళ్లు చేస్తోన్న ఎక్సైజ్ కానిస్టేబుల్ తీరును కళ్లకు కట్టినట్లుగా తన వీడియోలో శ్యామ్‌లాల్ వివరించాడు. జాతీయ రహదారులపై అంతరాష్ట్ర చెక్‌పోస్టుల్లో జరుగుతోన్న అవినీతిపై అనేక వీడియోలు తీసిన ఇతగాడి చేతికి మద్నూర్ చెక్‌పోస్టు అక్రమాలు చిక్కడంతో బాహ్య ప్రపంచానికి కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ శాఖ చీకటి కోణం బయట పడినట్లు అయ్యింది. ఈ వీడియోపై ఎక్సైజ్ శాఖ కమిషనర్ స్పందించి విచారణకు ఆదేశించాల్సి వచ్చింది. తదుపరి బాధ్యులను సస్పెండ్ చేశారు.
ఆరు నెలల క్రితమే రూ.2లక్షలు లంచం తీసుకుంటూ బిచ్కుంద ఎక్సైజ్ సీఐ అడ్డంగా ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటన మరువక ముందే అదే ప్రాంతంలో అంతరాష్ట్ర చెక్‌పోస్టులో డబ్బుల వసూళ్లు రాజ్యమేలడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చింత చచ్చినా… పులుపు చావదు అన్నట్లుగా ఆబ్కారీ శాఖలో అవినీతి మారింది. శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితం ఉండటం లేదు. ఎవరో ఒకరు… ఏదో ఒక రూపంలో అక్రమాలకు పాల్పడుతున్నారు. సామాన్య జనాలకు తీరని అన్యాయం చేస్తున్నారు. కొత్త డీసీ, ఇద్దరు నూతన ఎక్సైజ్ సూపరింటెండెంట్ల పర్యవేక్షణలో ఇప్పటికైనా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఆబ్కారీ అవినీతి తగ్గుతుందా? మరింత విజృంభిస్తుందా? అనేది కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.