న్యూఢిల్లీ, ఆగస్టు 6: కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ దేశంలోని ఐటీ నిబంధనల్లో మార్పులను ప్రతిపాదించింది. దీని ప్రకారం సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలు, ఇతర మధ్యవర్తులు చట్టవిరుద్ధమైన ఏఐ(కృత్రిమ మేధ) సృష్టించిన కంటెంట్‌ను తొలగించడానికి ప్రస్తుతం ఉన్న 36 గంటల గడువుకు బదులుగా ప్రభుత్వం లేదా న్యాయస్థానం నుండి సరైన ఆదేశం అందిన కేవలం మూడు గంటల్లోపే చర్యలు తీసుకోవలసి ఉంటుంది. డీప్‌ఫేక్‌లు, ఏఐ ఆధారిత తప్పుడు సమాచారం, ఇతర హానికరమైన సింథటిక్ మీడియాను ఎదుర్కోవడానికి చేపట్టిన విస్తృత ప్రయత్నంలో భాగంగా ఏఐ సృష్టించిన కంటెంట్‌కు తప్పనిసరిగా లేబులింగ్ చేయాలని, ఫిర్యాదుల పరిష్కారానికి వేగవంతమైన కాలపరిమితిని నిర్దేశించాలని కూడా ఈ ముసాయిదా నిబంధనలు నిర్దేశిస్తున్నాయి.
ఏఐ ఆధారిత డీప్‌ఫేక్‌లు, నకిలీ ఆడియో, వీడియోలు, టెక్ట్స్ సహా ఇతర సింథటిక్ కంటెంట్ వల్ల పెరుగుతున్న ముప్పును ఎదుర్కోవడమే ప్రతిపాదిత మార్పుల లక్ష్యమని ఆ శాఖ పేర్కొంది. వినియోగదారుల కోసం ఒక బహిరంగ, సురక్షితమైన, విశ్వసనీయమైన, జవాబుదారీ సైబర్‌స్పేస్‌ను సృష్టించడంతోపాటు చట్టవిరుద్ధమైన ఏఐ ఆధారిత కంటెంట్ వ్యాప్తిని అరికట్టడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలు, ఇతర మధ్యవర్తులపై ప్రభుత్వం కఠినమైన నిబంధనలను ప్రతిపాదించింది. నగ్నత్వం లేదా ఇతరుల్లా నటించడం వంటి సున్నితమైన అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రస్తుతం ఉన్న 24 గంటల గడువుకు బదులుగా రెండు గంటల లోపే పరిష్కరించాల్సి ఉంటుంది.
చట్టవిరుద్ధమైన ఏఐ సృష్టించిన కంటెంట్‌ను షేర్ చేయడం వల్ల కలిగే చట్టపరమైన పరిణామాల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించాలని ఈ ముసాయిదా సోషల్ మీడియా కంపెనీలను నిర్దేశిస్తుంది.