బెల్లంపల్లి, మే 13 : అర్హులకు కాదని అనర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించారంటూ బుధవారం బెల్లంపల్లిలో స్థా నికులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక పద్మశాలీ భవన్లో 108 డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయింపు కోసం సబ్ కలెక్టర్ మనోజ్ ఆధ్వర్యం లో లక్కీడ్రా ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహించా రు. పలువురు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు మం జూరైన వారు, ఇప్పటికే రెండేసి ఇండ్లు ఉన్నవారిని జాబితాలో చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనులు చేసుకునే వారిని విస్మరించి ఆర్థికంగా ఉన్నవారికే ఇండ్లు కట్టబెట్టారని సబ్ కలెక్టర్ ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు.
బెల్లంపల్లి పట్టణానికి 160 డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరయ్యాయి. 108 నిర్మాణాలు పూర్తి కావడంతో 34 వార్డుల నుంచి 496 మందితో అర్హుల జాబితా తయారు చేసిన రెవెన్యూ అధికారు లు విడుదల చేశారు. ఎస్టీ 11, ఎస్సీ 158, మైనార్టీ 91, ఇతరులు 236 మందిని గుర్తించారు. 108 మంది లబ్ధిదారుల కోసం లాటరీ ద్వారా సబ్‌కలెక్టర్ సమక్షంలో ఎంపిక చేశారు. ఇందులో అనేక మంది అనర్హులు ఉన్నారంటూ అసలైన లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి పోలీసులు కలగజేసుకుని వారిని బయటికి పంపించారు.
మొదట విడుదల చేసిన జాబితా నుంచి అర్హులను తొలగించారని ఆరోపిస్తూ లాటరీ ప్రక్రియ ప్రారంభం ముందే బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి వారికి ఎలాంటి సమాధానం లేకపోవడంతో ఎంపిక ప్రక్రియను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి, హాల్ నుంచి బయటకు వెళ్లారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు గూడు కల్పించాలనే ఉద్ధేశంతోనే డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించిందని, ఇండ్లు ఉన్న వారికి ఇవ్వడానికి కాదని, పూర్తిగా అనర్హులకు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డ్రాలో వేసే స్లిప్‌లను ఎవరి సమక్షంలో రాశారు, దానికి ఏమైనా కమిటీ వేశారా అని ప్రశ్నించారు. ఎంపిక ప్రక్రియ ఆద్యాంతం పోలీస్ పహారాలో కొనసాగింది. ఉదయం మెయిన్ గేట్ ముందు జాబితాలో ఉన్న లబ్ధిదారులను ఒక్కరిని మాత్రమే వారి ఆధార్ కార్డు ఆధారంగా లోనికి పంపించారు. వారితో ఏ ఒక్కరిని కూడా లోపలికి అనుమతించ లేదు. నాయకులను మాత్రం ఇష్టం వచ్చినట్లు లోనికి అనుమతించారని లబ్ధిదారులు మండి పడ్డారు. కౌన్సిలర్లకు సరిగా ప్రతిష్టాత్మకమైన డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే వినోద్ హాజరు కాలేదని గుసగుసలు వినిపించాయి.