తిర్యాణి,డిసెంబర్ 29 : సమాజ హితం కోసం బాధ్యతాయుతంగా పని చేయడమే పోలీసుల ప్రథమ కర్తవ్యమని కుమ్రంభీం ఆసిఫాబాద్ ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. పోలీసులు మీకోసంలో భాగంగా తిర్యాణి పోలీసుల ఆధ్వర్యంలో మంగీ గ్రామంలో మెడిలైఫ్ హాస్పిటల్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించగా, జిల్లా అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావుతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధులకు దుప్పట్లు, యువతకు క్రీడా సామగ్రి పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఆయా ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఉన్నత విద్య అభ్యసించలేని నిరుపేద విద్యార్థులకు తమవంతు సాయమందిస్తామని తెలిపారు.
దేశ భవిష్యత్ నేటి యువతరం మీదే ఆధారపడి ఉందని, వ్యసనాలకు దూరంగా ఉండి భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోవాలన్నారు. గంజాయి సాగు చేసినా, సేవించినా శిక్ష తప్పదని హెచ్చరించారు. భీంపూర్ నుంచి మంగీ, మంగీ నుంచి గుండాల వరకు, అలాగే కౌఠగాం, కెరగూడ, గోపెర, తైతర గ్రామాల్లో రోడ్లు నిర్మించేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కరుణాకర్, రెబ్బెన సీఐ బుద్ధే స్వామి, అనిల్ యువసైన్యం ఫౌండేషన్ అధ్యక్షుడు జవ్వాజీ అనిల్‌గౌడ్, తిర్యాణి, రెబ్బెన ఎస్ఐలు వేణుమాధవ్గౌడ్, చంద్రశేఖర్, మెడిలైఫ్ హాస్పిటల్ వైద్యులు కుమార స్వామి, శ్రీధర్, వినయ్, శ్రీధర్, ప్రసన్న, శ్రేయ, రఘు, రోజిత, మార్కెటింగ్ మేనేజర్ శంకర్ పాల్గొన్నారు.