మంచిర్యాల, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల మధ్య వివాదాలు తీవ్రమవుతున్నాయి. చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ బ్రదర్స్‌కు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు (పీఎస్ఆర్), ఆయన సతీమణి డీసీసీ అధ్యక్షురాలు సురేఖ మధ్య కోల్డ్‌వార్ నడుస్తూనే ఉంది. ఎన్నికల ముందు ఒక్కసారి పీఎస్ఆర్ ఇంట్లో అందరూ కలిసి ప్రెస్‌మీట్ పెట్టారు. అందరం కలిసి ఉన్నాం, కాంగ్రెస్‌ను గెలిపించుకుంటామని చెప్పారు. కానీ.. ఎన్నికల ఫలితాలు వచ్చాక ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఒకసారి కూడా కలువలేదు.
ఫలితాలు వచ్చిన రోజే గడ్డం వివేక్, వినోద్‌లు మా నాన్న వెంకటస్వామి చేసిన సేవలను గుర్తుంచుకుని ప్రజలు తమను గెలిపించారని చెప్పారు. ప్రేమ్‌సాగర్‌రావు మాత్రం డీసీసీ అధ్యక్షురాలు సురేఖ తొమ్మిదేళ్లు కష్టపడి మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను గెలిపించుకోవడంలో కీలక పాత్ర పోషించారంటూ చెప్పారు. అప్పటి నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ఎడముఖం, పెడముఖంగా ఉంటూ వస్తున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ మంత్రి వర్గంలో ఈ ముగ్గురిలో ఒకరికే చాన్స్ ఉందంటూ ప్రచారం జరిగింది. ఒకరు ఢిల్లీకి వెళ్లి, ఒకరు పీసీసీ అధ్యక్షుడి దగ్గరకు వెళ్లి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంలో కీలక నేత దగ్గరకు వెళ్లి మరొకరు ముమ్మర ప్రయత్నాలు చేశారు.
దీంతో ముగ్గురి మధ్య గ్యాప్ ఇంకాస్త పెరిగిందనే గుసగుసలు వినిపించాయి. మంచిర్యాలలో గురువారం జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ప్రెస్‌మీట్ విషయంలో వివేక్, పీఎస్ఆర్ మధ్య విభేదాలు బయటపడ్డాయి. ముందు గడ్డం వివేక్ ఇంట్లో ఉదయం 10 గంటలకు ప్రెస్‌మీట్ ఉంటుందని చెప్పారు. దానిని పీఎస్ఆర్ ఇంటికి మార్చారు. దీంతో వివేక్ ఆ ప్రెస్‌మీట్‌కు రాకుండా దూరంగా ఉండిపోయారు. ముందు వివేక్ ఇంట్లో అనుకున్న ప్రెస్‌మీట్ ఎందుకు మారింది? జిల్లా అధ్యక్షురాలి ఇంట్లో పెట్టాలనుకుని ఉంటే మరి వివేక్ ఎందుకు ప్రెస్‌మీట్‌కు రాలేదనేది అర్థం కాలేదు. దీంతో వివేక్ ఇంటికి పీఎస్ఆర్ వెళ్లడు, పీఎస్ఆర్ ఇంటికి వివేక్ రాడు ఇద్దరికి ఒకరంటే ఒకరు పడడం లేదని అక్కడున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుకోవడం కనిపించింది.
ఇంద్రవెల్లిలో నిర్వహించే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభను విజయవంతం చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. మంచిర్యాలలోని పీఎస్ఆర్ నివాసంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికలకు ముందు టీపీసీసీ అధ్యక్షుడిగా ఇంద్రవెల్లిలో సభ నిర్వహిం చి ప్రచారం మొదలుపెట్టిన రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారన్నారు. అదే స్ఫూర్తితో మారుమూ ల జిల్లా ఆదిలాబాద్ నుంచే అభివృద్ధి పథం లో మొదటి అడుగు వేయాలని కాంగ్రెస్ ప్ర భుత్వం నిర్ణయించుకుందన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె కోరా రు. అనంతరం సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు ఇంద్రవెల్లి బయల్దేరి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో మంచిర్యా ల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ పాల్గొన్నారు.