దండేపల్లి : ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఎం( CPM) , టీఏజీఎస్(Advasi Girijana Sangam) ఆధ్వర్యంలో దండేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం భారీ ర్యాలీ ( Rally) నిర్వహించారు. చాకలి ఐలమ్మ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించి తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ సంధ్య రాణికి వినతి పత్రం అందజేశారు.
సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పైల్ల ఆశయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటి వరకు ఇండ్లు ఇవ్వలేదన్నారు. మహిళలకు రూ . 2500 ఆర్థిక సాయం , ఆరు గ్యారంటీలు అందడం లేదని ఆరోపించారు. ప్రభుత్వానికి పర్యవేక్షణ లేక పోవడం వల్ల గ్రామాలలో పారిశుద్ధ్యం లోపించిందన్నారు.
మరోపక్క మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, మిషన్ భగీరథ నీళ్లు శుభ్రంగా రావడం లేదని విమర్శించారు. సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు, పోడు భూములకు హక్కు పత్రాలు అందజేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సంకే రవి, కార్యదర్శి వర్గ సభ్యులు అశోక్,చందు, జిల్లా కమిటీ సభ్యులు దుంపల రంజిత్ కుమార్, ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్లా, ఐద్వా మహిళ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమారాణి, సభ్యులు సమ్మక్క, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు లింగన్న, సీఐటీయూ నాయకులు లక్ష్మణ్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.