మంచిర్యాల, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మద్దతు ధరకు ధాన్యం కొనడంతో పాటు సన్న రకాలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామన్న హామీ ఉత్త బోగసే అని తేలిపోయింది. సన్నాలకు బోనస్ ఇచ్చేందుకు కోట్లాది రూపాయాలు కేటాయించామని గొప్పలు చెప్పుకుంటున్న సర్కారు.. 33 రకాలకే బోనస్ అంటూ మెలిక పెట్టింది. కొన్ని రకాల ధాన్యాల పేర్లు చెప్పి, వాటినే సన్నాలుగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఇక ఈ విషయం తెలియని రైతులు సన్న వడ్లు పట్టుకొని కొనుగోలు కేంద్రానికి వెళ్తే చాలు.. క్వింటాకు రూ.500 బోనస్ వస్తుందనుకుంటున్నారు. కానీ.. అసలు విషయం ఏమిటంటే ప్రభుత్వం చెప్పిన 33 రకాలకే బోనస్ వర్తిస్తుంది.
ఆ 33 రకాలను కూడా గ్రేన్ క్యాలిఫర్ అనే పరికరంలో పెట్టి పొడవు, వెడల్పు కొలుస్తారు. ధాన్యం గింజ పొడువు 6 ఎం.ఎం కంటే తక్కువగా.. గింజ వెడల్పు 2 ఎం.ఎం కంటే తక్కువగా ఉండాలి. ఈ పొడవు, వెడల్పుల నిష్పత్తి మొత్తం కలిపితే 2.5 ఎం.ఎం కంటే ఎక్కువగా ఉండాలి. అప్పుడే దాన్ని సన్నరకంగా పరిగణలోకి తీసుకుంటారు. పైగా ధాన్యం తేమ శాతం 17 శాతం కంటే ఎక్కువగా ఉండకూడదు. ఇచ్చే రూ.500 బోనస్‌కు ఇన్ని రకాల కొర్రీలు పెట్టిన సర్కారు రాష్ట్రంలో 48.91 లక్షల టన్నుల సన్న వరి దిగుబడి వస్తుందని, ఆ మొత్తానికి రూ.500 చొప్పున చెల్లించేందుకు రూ.2,445 కోట్లు అవసరమవుతాయని చెప్పుకుంటుంది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది.
ఉమ్మడి జిల్లాలో 50 శాతం సన్నాలకు కోతే
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో వరి ఎక్కువగా సాగవుతుంది. మంచిర్యాల జిల్లాలో వానకాలం సీజన్లో 3.30 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. ఇందులో 65 శాతానికి పైగా సన్నాలే పండించారని అధికారులు చెబుతున్నారు. కాకపోతే మన జిల్లాలో ప్రభుత్వం చెప్పిన 33 రకాల కంటే ప్రైవేట్ కంపెనీలకు చెందిన సన్న రకాలనే ఎక్కువ మంది సాగు చేశారు. సాగైన సన్న ధాన్యంలో 50 శాతం నుంచి 60 శాతం అవే ఉంటాయని మండలాల్లోని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో అత్యధికమంది సాగు చేసిన ఓ సన్న రకం ధాన్యం సీడ్ సగం పిలకలు వచ్చి సగం రాకుండా ఉండిపోయిందని, దాంతో దిగుబడి కూడా తగ్గొచ్చని పేర్కొంటున్నారు. ఇక నిర్మల్ జిల్లాలో ఈ సీజన్లో 1.46 లక్షల టన్నులు ధాన్యం దిగుబడి రానుంది. ఇందులో సన్న రకం ధాన్యం 45 శాతం వరకు ఉంది.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 29 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రానుండగా, ఇందులో సన్నాలు ఐదువేల మెట్రిక్ టన్నులు ఉండొచ్చని భావిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పెద్దగా ధాన్యం కొనుగోళ్లు లేవు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే రైతులు సాగు చేసిన సన్న రకాలు.. అధికారులు పెట్టిన నిబంధనలతో సరిపోలడం లేదు. పొడవు, వెడల్పులు ప్రభుత్వం పెట్టిన సైజ్‌లో ఉండడం లేదు. దీంతో చాలా మంది ప్రైవేట్‌కు విక్రయిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో ప్రస్తుతం ఇదే జరుగుతుంది. అధికారులు సైతం ఉద్దేశపూర్వకంగానే తేమశాతం, సైజ్ పేరుతో ధాన్యం కొనుగోలును జాప్యం చేస్తున్నారు. దీంతో రైతులు ఎక్కువగా ప్రైవేట్ దళారులకు అమ్ముకోవాల్సి వస్తుందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు పూర్తిస్థాయిలో జరగడం లేదు. మంచిర్యాల 326, నిర్మల్ 233 సెంటర్లు, కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో 34 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి వీటిలో పదిశాతం కేంద్రాల్లో కూడా ఇంకా కొనుగోళ్లు మొదలవ్వలేదు. నిర్మల్ జిల్లాలో 15 నుంచి 20 సెంటర్లలోనే కొనుగోలు చేస్తున్నారు.
సన్న వడ్ల బస్తాకు ఎరుపు దారం.. దొడ్డు రకానికి ఆకుపచ్చ దారం
రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన సన్న రకం ధాన్యం పొడవు, వెడల్పు, తేమశాతం.. నిబంధనల మేరకు ఉండి.. 33 రకాల్లో ఒకటైతేనే దాన్ని సన్నరకంగా పరిగణలోకి తీసుకుంటారు. సన్న ధాన్యం నింపిన బస్తాలను ఎరుపు రంగు దారంతో కుడుతారు. అదే దొడ్డు రకాలైతే ఆకుపచ్చ రంగుతో కుడుతారు. రైతులు తీసుకెళ్లిన ధాన్యం ఏ రకంగా పరగణిలోకి తీసుకున్నారో తెలుసుకునేందుకు ఇది ఒక బండ గుర్తుగా పెట్టుకోవాలని అధికారులు చెబుతున్నారు. సన్నరకాలను గుర్తించే పరికరాలు అన్ని కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయన్నారు. అనుమానాలుంటే మండల ఏఈవో పరికరంలో చూసి రైతులకు అవగాహన కల్పిస్తారు. కొనుగోలు కేంద్రాల్లో ఒకే.. అన్న తర్వాత మిల్లర్లు ఏమైనా ఇబ్బంది పెడితే వాటిని పరిష్కరించే బాధ్యతను సైతం ఏఈవోలకే అప్పగించారు. 24 గంటల్లో ఏఈవో స్థాయిలో దానికి పరిష్కారం లభించకపోతే డివిజన్ లెవవల్లో డీఈ సివిల్ సప్లయ్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ దాన్ని పరిష్కరిస్తారు. 48 గంటల్లోనూ అది పరిష్కారం కాకపోతే జిల్లా అగ్రికల్చర్ అధికారి, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
వీటికే బోనస్..
రాష్ట్ర ప్రభుత్వం 33 రకాల సన్న ధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని ప్రకటించింది. ఆ 33 రకాలు ఏమిటంటే.. కంపసాగర్ వరి-1(కేపీఎస్2874), డబ్ల్యూజీఎల్ 44, జేజీఎల్ 27356, బీపీటీ 5204, జేజీఎల్ 28545, డబ్ల్యూజీఎల్ 32100, 14, జేజీఎల్ 384, జేజీఎల్ 11470, ఆర్ఎన్ఆర్15048, జేజీల్ 3828, ఆర్ఎన్ఆర్ 2458, డబ్ల్యూజీఎల్ 962, వరంగల్ వరి-1119, కేఎన్ఎం 733, ఆర్ఎన్ఆర్ 21278, జేజీఎల్ 3855, జేజీఎల్11118, జేజీఎల్ 3844, 1798, డబ్ల్యూజీఎల్ 347, ఆన్‌ఆర్‌ఆర్ 31479(పీఆర్సీ), ఆర్ఎన్ఆర్ 2345, జేజీఎల్ 17004,ఆర్ఎన్ఆర్ 2465, ఎన్‌ఎల్‌ఆర్ 34449, ఆన్‌ఆర్‌ఆర్ 31479(పీఆర్సీ), కేపీఎస్ 6251(పీఆర్సీ), జేజీఎల్ 33124(పీఆర్సీ), ఎంటీయూ 1262, ఎంటీయూ 1224 తదితర రకాలకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తారు.