మంచిర్యాలటౌన్/నస్పూర్/ఆసిఫాబాద్ టౌన్, సెప్టెంబర్ 1 : భారీ వర్షాల నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ సరఫరాలో ఎక్కడా అంతరాయం లేకుండా తగిన చర్యలు చేపట్టాలని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఆదేశించారు. ఆదివారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, హైదరాబాద్ నుంచి రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్ రెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కలెక్టర్లు కుమార్ దీపక్, వెంకటేశ్ ధోత్రే, రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, ఆసిఫాబాద్ ఎస్పీ శ్రీనివాస్ రావు, అదనపు కలెక్టర్లు దాసరి వేణు, మోతీలాల్, 16 సర్కిళ్ల ఎస్ఈలు, 40 మంది డీఈలు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ వర్షాల నేపథ్యంలో అధికారులు అలర్ట్‌గా ఉండాలని, ప్రాణనష్టం సంభవించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రెస్యూ బృందాలను సిద్ధంగా ఉంచాలని, క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించాలన్నారు.
ప్రజలు జల దిగ్భందంలో చిక్కుకుంటే తక్షణ సహాయ చర్యలు చేపట్టాలన్నారు. చెరువులు, కుంటలు, వాగుల వద్దకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు, రెవెన్యూ సిబ్బందితో నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. లోలెవెల్ వంతెనలు, కాజ్‌వేలపై నీరు ప్రవహిస్తే రాకపోకలను నిలిపివేయాలన్నారు. నీట మునిగిన సబ్స్టేషన్ల వివరాలు తెలుసుకుని వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి విద్యుత్ సరఫరా చేయాలన్నారు. విద్యుత్ అంతరాయం కలిగిన చోట కలెక్టర్, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని పునరుద్ధరించాలని తెలిపారు.
కంట్రోల్‌రూం నుంచి వచ్చే ఆదేశాలను క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు ఎప్పటికప్పుడు అమలు చేయాలని సూచించారు. అవసరమైన విద్యుత్ స్తంభాలు, వైరు, ట్రాన్స్ఫార్మర్లు, మిగతా మెటీరియల్ అందుబాటులో ఉంచుకోవాలని, ఎలాంటి పరిస్థితులు వచ్చినా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ప్రజలకు సేవలందించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.
విద్యుత్ అంతరాయాలకు సంబంధించిన సమస్యలుంటే ప్రజలు వాటి పరిష్కారానికి విద్యుత్ శాఖ ఏర్పాటుచేసిన 1912, 18004250028 టోల్‌ఫ్రీ నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదులపై కంట్రోల్ రూం నుంచి నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. సామాజిక బాధ్యతను విస్మరించి విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్, కలెక్టరేట్ పాలన అధికారి రాజేశ్వర్, ఎస్ఈ శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు.