నిర్మల్ జిల్లాలో 24 గంటల పాటు ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. అన్నదాతలను నిండా ముంచి ఆగమాగం చేసింది. గోదావరి వరదతో పాటు పలు చోట్ల సాగునీటి కాలువలకు గండ్లు పడడంతో పంటలు నీట మునిగాయి. చేలల్లో ఇసుక, బురద మేటలు వేశాయి. మరోవైపు పలుచోట్ల రోడ్లు, కల్వర్టులు కొట్టుకపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇండ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అధికారులు సహాయక చర్యలు చేపడుతూ వరద నష్టంపై సర్వే చేపడుతున్నారు.
నిర్మల్, ఆగస్టు 29(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలో కురిసిన వాన ముఖ్యంగా వరి, పత్తి, సోయాబీన్, మక్క తదితర పంటలతో పాటు కూరగాయల పంటలను నీళ్ల పాలు చేసింది. సారంగాపూర్ మండలం సాయినగర్ తండా సమీపంలో హైలెవెల్ కాలువకు గండి పడడంతో వందల ఎకరాల్లో వరిపంట నీట మునిగింది. సోన్, లక్ష్మణచాంద మండలాల్లో గోదావరి వరదతో వరి, పత్తి, మక్క పంటలకు నష్టం వాటిల్లింది. భైంసా మండలంలోని సిరాల, ఇలేగాం చెరువులు పూర్తి స్థాయిలో నిండిపోవడమే కాకుండా అలుగులు పారుతుండడంతో చెరువుల వెనుకవైపు ఉన్న వందల ఎకరాల్లో సోయా, పత్తి పంటలు నీట మునిగాయి. గడ్డెన్న వాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో కామోల్, ఖత్గాం గ్రామాల రైతులకు చెందిన వందల ఎకరాల్లో పత్తి, సోయాబీన్ పంటలు నీట మునిగాయి.
గురువారం మధ్యాహ్నం నుంచి వర్షం తగ్గడం, వరద తీవ్రత లేకపోవడంతో వ్యవసాయశాఖతో పాటు నీటి పారుదల, పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖలన్నీ క్షేత్ర స్థాయిలో నష్టం అంచనాలను రూపొందించేందుకు సర్వే చేపట్టారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టంపై సర్వే చేసి శుక్రవారం అంచనాలు రూపొందించారు. ప్రాథమిక అంచనాల మేరకు జిల్లాలో మొత్తం 4,762 మంది రైతులకు సంబంధించి 9,149 ఎకరాల్లో పం ట నష్టం జరిగినట్లు గుర్తించారు. ఇందులో వరిపంట 2,491 ఎకరాలు, సోయా 2,152 ఎకరాలు, పత్తి 2,823 ఎకరాలు, మక్కపంట 1,100 ఎకరాల్లో నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. మరో 583 ఎకరాల్లో ఇసుక మేటలు వేసినట్లు అధికారులు చెబుతున్నారు. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి.. ఇటీవల కురిసిన అతి భారీ వర్షాలతో పంచాయతీరాజ్ శాఖ పరిధిలో గల 30 రోడ్లు చెడిపోయినట్లు అధికారులు గుర్తించారు.
ఇందులో కడెం, ఖానాపూర్ మం డలాల్లోని పలు గ్రామాల్లో 10 రోడ్లు పెద్ద ఎత్తున ధ్వంసం కాగా, జిల్లా వ్యాప్తంగా మరో 20 రోడ్లు పా క్షికంగా డ్యామేజీ అయినట్లు పేర్కొన్నారు. ఆయా రోడ్ల మరమ్మతుల కోసం దాదాపు రూ.4 కోట్లు అవసరమవుతాయని అంచనాలు రూపొందించారు. రో డ్లు భవనాల శాఖ పరిధిలోని 22 రోడ్లు ధ్వంసమైన ట్లు అధికారులు గుర్తించారు. 37 ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. 12 చోట్ల రోడ్లు పూర్తిగా తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా రోడ్ల తాత్కాలిక మరమ్మతులకు రూ.2.20 కోట్లు అవసరమవుతాయని సంబంధిత శాఖ అధికారులు అంచనాలు రూపొందించారు. ఆయా రోడ్లను శాశ్వతంగా బాగు చేయాలంటే రూ.13.86 కోట్లు అవసరమవుతాయని అధికారులు తెలిపారు.
నీటి పారుదల శాఖకు సంబంధించి పలు చోట్ల చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయి. మొత్తం 18 చోట్ల మరమ్మతులు అవసరమని గుర్తించిన అధికారులు వాటికి తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.39.70 లక్షలు అవుతాయని పేర్కొన్నారు. శాశ్వత మరమ్మతుల కోసం రూ.8 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇలా మొత్తం అన్ని శాఖల పరిధిలో దాదాపు రూ.100 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. గతేడాది మాదిరిగా కేవలం కాగితాలు, ప్రకటనలకే పరిమితం కాకుండా రైతులను, ఆస్తులు నష్టపోయిన బాధితులందరికీ నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు.
నిర్మల్ అర్బన్, ఆగస్టు 29 : నిర్మల్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో 1462.6 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది.జిల్లాలో అత్యధికంగా ముథోల్లో 221.6 మి.మీటర్లు నమోదుకాగా అత్యల్పంగా నిర్మల్ రూరల్లో 26.6 నమోదైంది. జిల్లాలోని ఆయా మండలాల్లో కుభీర్ 118, తానూర్ 93.6, బాసర 85.2, భైంసా 167.4, నర్సాపూర్ (జీ) 35.2, లోకేశ్వరం 90., దిలావర్పూర్ 48.8, సారంగాపూర్ 45.4., నిర్మల్ 33.6, సోన్ 51.8, లక్ష్మణచాంద 52.4,మామడ 62.2, పెంబి 105.6, ఖానాపూర్ 43.2, కడెం 61.2, దస్తూరాబాద్ 48.6 మి.మీటర్ల వర్షపాతం నమోదు కాగా జిల్లా వ్యాప్తంగా సగటున 77 మి.మీటర్లు నమోదైంది.