దండేపల్లి, నవంబర్ 19 : జిల్లాలో వానకాలం పంట దాదాపు చేతికిరాగా, రైతాంగం అప్పుడే యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్నది. ఈ క్రమంలో సాగు విస్తీర్ణాన్ని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. జిల్లాలో 1,24,292 ఎకరాల్లో పంట సాగవనున్నదని ప్రణాళికలు సిద్ధం చేసింది. బావులున్న ప్రాంతాల్లో రైతులు నారుమళ్లు సిద్ధం చేసుకుంటున్నారు. సమృద్ధిగా వర్షాలు కురవడంతో జలాశయాలు, వాగులు, కుంటల్లోకి పుష్కలంగా నీరు చేరింది. ఇందుకు అనుగుణంగా సాగు విస్తీర్ణం, అవసరమయ్యే విత్తనాలు, ఎరువుల వినియోగంపై జిల్లా వ్యవసాయాధికారులు ప్రణాళికలు రూపొందించారు. 1,24,292 ఎకరాల్లో సాగు అంచనా వేయగా, ఇందులో 1.05 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశమున్నదని తెలిపారు. దీంతో పాటు వివిధ పంటలకు 27 వేల క్వింటాళ్ల విత్తనాలు, అలాగే 39,663 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనా వేశారు.
ఎల్లంపెల్లి జలాశయంలో సమృద్ధిగా నీరు ఉండడంతో గూడెం ఎత్తిపోతల ద్వారా యాసంగికి నీరు అందించనున్నారు. కడెం 30వ డిస్ట్రిబ్యూటరీ కాలువ నుంచి చివరి వరకు 30 వేల ఎకరాలు సాగవుతున్నది. నీరు పుష్కలంగా ఉండడంతో సాగు మరింత పెరిగే అవకాశాలున్నాయి కాలువలకు దూరంగా ఉన్న పొలాల్లో మక్క, వేరుశనగ సాగు చేయనున్నారు. కడెం జలాశయం నుంచి జన్నారం మండలంతో పాటు, దండేపల్లి మండలంలోని 28 కాల్వ వరకు నీటిని అందించనున్నారు.
జిల్లాలో ముందుగా నాట్లు వేసిన చోట వరి కోతలు పూర్తయి, పంట చేతికొచ్చింది. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి, తూకం వేసుకొని విక్రయించే పను ల్లో నిమగ్నమయ్యారు. ఆలస్యంగా సాగైన చోట పంట కోతలు నడుస్తుండగా, మరి కొన్ని చోట్ల వారం, పది రోజుల్లో కోతలు ఊపందుకోనున్నాయి. పనులన్నీ పూర్తవగానే బావులు, నీటి వనరులు ఉన్న రైతులు యాసంగి పనులు ప్రారంభించనున్నారు.