ఎదులాపురం/నిర్మల్ టౌన్, జనవరి 21 : తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు శిబిరాలను పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆయా జిల్లాల కలెక్టర్లు, వైద్యాధికారులను ఆదేశించారు. హైదరాబాద్ బీఆర్కే భవన్ నుంచి శనివారం వైద్య ఆరోగ్య కార్యదర్శి రిజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్యాధికారులతో కంటి వెలుగు శిబిరాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తం గా రెండు రోజుల్లో 3,81,426 మందికి కంటి పరీక్షలు నిర్వహించామన్నారు. అందులో 97,335 మందికి రీడింగ్ కళ్లద్దాలు పంపిణీ చేశామని, 77,142 ప్రిస్క్రిష్షన్ కళ్లద్దాలను ఆర్డర్ చేశామని వెల్లడించారు. కంటి వెలుగు శిబిరాలకు పకడ్బందీగా ఏర్పాటు ్ల చేసిన ఆయా జిల్లాల కలెక్టర్లను, సంబంధిత అధికారులను సీఎస్ అభినందించారు. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు క్యాంపులు జరుగుతాయని, శని, ఆదివారాలు ఉండవని తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 9:15 గంటల లోపు శిబిరాలను పర్యటించాలన్నారు. జిల్లాలోని బఫర్ బృందాలను ఉపయోగిస్తూ జర్నలిస్టులు, ఉద్యోగులు, పోలీసులు, కోర్టు సిబ్బంది, వివిధ వర్గాల వారికి ప్రత్యేక కంటి వెలుగు శిబిరాలు నిర్వహించాలని సూచించారు. అంతకుముందు ఆయా జిల్లాల్లో రెండ్రోజులుగా శిబిరాల ద్వారా చేసిన నిర్ధారణ పరీక్షలు, అద్దాల పంపిణీ, నిర్ధారణ కేంద్రాల వద్ద సదుపాయలు, తదితర అంశాలపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ శిబిరాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని సూచించారు. ప్రతిరోజూ సిబ్బంది సమయపాలన పాటించాలని, వచ్చిన వారి వివరాలను ఆన్లైన్లో డేటా నమోదు చేయాలన్నారు. అవసరమైన వారిని శస్త్రచికిత్స కోసం రెఫర్ చేయాలని తెలిపారు. ఇప్పటివరకు కళ్లద్దాలు పంపిణీ చేసిన వివరాలను అడిగిన శాంతికుమారి, అవసరమైతే మళ్లీ అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. జిల్లాలో రెండు రోజుల్లో నిర్వహించిన శిబిరాల్లో 10,361 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 1520 మందికి రీడింగ్ కళ్లద్దాలు అందించామని వివరించారు. 1758 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలకు సిపారసు చేసినట్లు తెలిపారు. జిల్లాకు 30వేల రీడింగ్ కళ్లద్దాలు అందాయని తెలిపారు. 2 బఫర్ బృందాల ద్వారా ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్, నిర్మల్ అదనపు కలెక్టర్లు ఎన్ నటరాజ్, హేమంత్ బోర్కడే, ట్రైనీ సహాయ కలెక్టర్ పీ శ్రీజ, డీఎంహెచ్వోలు నరేందర్ రాథోడ్, ధన్రాజ్, వైద్యులు వైశాలి, సురేశ్, క్వాలిటీ కంట్రోల్ అధికారి డాక్టర్ అరవింద్, డీఆర్డీవో కిషన్, మున్సిపల్ కమిషనర్ శైలజ, డీపీవో శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.