జన్నారం, ఏప్రిల్ 16 : కడెం ప్రధాన కాలువతో పాటు 13,19, 22 డిస్ట్రిబ్యూటరీ కాలువలు ద్వారా నీటి విడుదల నిలిపివేయగా, రైతాంగం ఆందోళన చెందుతున్నది. కోటి ఆశలతో సాగు చేసిన పంటలు చేతికొచ్చే దశలో ఎండిపోతుంటే గుండెలు బాదుకుంటున్నది. జన్నారం మండలంలోని 29 గ్రామ పంచాయతీల పరిధిలో 5 వేల ఎకరాల్లో వరి, 840 ఎకరాల్లో మక్క, 142 ఎకరాల్లో జొన్న సాగు చేశారు. మొన్నటి వరకు కడెం ప్రాజెక్టు నుంచి వారబందీ పద్ధతిలో ఏడు వారాల పాటు నీటిని విడుదల చేశారు.
ప్రస్తుతం నీటి విడుదలకు బ్రేక్ వేయడంతో చేతికొచ్చే దశలో ఉన్న పంటలన్నీ ఎండిపోతున్నాయి. మొర్రిగూడ, తపాలాపూర్, తిమ్మాపూర్, రేండ్లగూడ, పొనకల్, ధర్మారం గ్రామాల్లో ఇప్పటికే వందలాది ఎకరాల్లో వరితో పాటు మిగతా పంటలు కూడా ఎండిపోయాయి. ప్రధానంగా పొట్టదశలో ఉన్న వరి పైరుకు నీరందక తాలుగా మారి తీవ్రంగా నష్టపోయే పరిస్థితి దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా కడెం ప్రాజెక్టు అధికారులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ చొరవ తీసుకొని మరో రెండు తడులు అందించి ఆదుకునేలా కృషి చేయాలని వారు వేడుకుంటున్నారు.
శిథిలమై అధ్వానంగా మారిన కాలువలు
కడెం ప్రధాన కాలువతో పాటు 13,19, 22 డిస్ట్రీబ్యూటరీ కాలువలు శిథిలమై అధ్వానంగా మారాయి. తూములు కూడా దెబ్బతిన్నాయి. కాలువల్లో పిచ్చిమొక్కలు పెరిగి చివరి వరకూ నీరందడం లేదు. కడెం ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేసినప్పుడల్లా ఎక్కడికక్కడ నీరంతా వృథాగా పోతున్నది. చివరి ఆయకట్టు వరకూ నీరందడం లేదని రైతులు చెబుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి కాలువలకు మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికట్టాలని వారు కోరుతున్నారు.
పై అధికారులదే నిర్ణయం
ఇప్పటికే యాసంగి పంటలకు ఏడు వారాల పాటు వారబందీ ద్వారా సాగు నీరందించాం. ప్రస్తుతం కడెం ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గింది. మరో రెండు తడులకు సాగునీరి వ్వాలని రైతులు కోరుతున్నారు. పై అధికాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు.
-శ్రావణ్‌కుమార్, ఇరిగేషన్ ఏఈ
పంటలు ఎండిపోకుండా చూడాలి
కడం ప్రాజెక్ట్ ప్రధాన కాలువ కింద సాగు చేసిన పంటలు ఎండిపోకుండా చూడాలి. ప్రస్తుతం వరి పైరు చేతికొచ్చే దశలో ఉంది. కడెం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలి. ఈ విషయంలో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలి. లేదంటే రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశముంది.
– కమ్మల విజయధర్మ, చింతగూడ పీఏసీఎస్ వైస్ చైర్మన్
చివరి ఆయకట్టుకూ నీరందించాలి
19, 22 డిస్ట్రిబ్యూటరీ కాలువల కింద సాగు చేసిన పంటల కు సాగు నీరందేలా చూడా లి. కొన్ని రోజులైతే వరి పంట కోతకు వస్తుంది. ఇప్పుడు సాగు నీరందించ కుంటే నాలాంటి రైతులు తీవ్రంగా నష్టపోతారు. కడెం ప్రాజెక్టు అధికారులు కనికరించి సాగు నీరందించాలి.
– భూమన్న, తపాలాపూర్, రైతు