కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో రెండు రోజుల పాటు కురిసిన అకాల వర్షాలు రైతన్నలకు అపార నష్టాన్ని మిగిల్చాయి. సుమారు 61 గ్రామాల్లో 271 మంది రైతులకు చెందిన దాదాపు 600 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
మామిడి, వరి, మక్క రైతులకు..
జిల్లాలో కురిసిన వడగండ్ల వర్షాలు మామిడి, వరి, మక్క పంటలకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ముఖ్యంగా కాగజ్నగర్ డివిజన్లోని కాగజ్నగర్, చింతలమానేపల్లి, ఆసిఫాబాద్ డివిజన్లోని రెబ్బెన మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మామిడి కాయలు రాలిపోగా, మక్క, వరి పంటలు నేలకొరిగాయి.
కాగజ్నగర్ మండలంలో 206 మంది రైతులకు చెందిన 350 ఎకరాల మక్క, 22 మంది రైతులకు చెందిన 57 ఎకరాల మామిడి, చింతలమానేపల్లి మండలంలో 10 మంది రైతులకు చెందిన 25 ఎకరాల వరి, 10 ఎకరాల పుచ్చ, 20 ఎకరాల మక్క, రెబ్బెన మండలంలోని 33 మంది రైతులకు చెందిన 136 ఎకరాల మామిడి పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. వడగండ్ల వానలతో పంటలకు జరిగిన నష్టంపై ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తామని వారు తెలిపారు.