ఎదులాపురం, ఆగస్టు 22 : వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న హెచ్చరించారు. యూరియా, రైతు బంధు, రైతు బీమా సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ కోణంలో ఆలోచిస్తూ రైతుల బతుకులతో చెలగాటమాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చాందా(టీ)లో వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి, నష్టపోయిన రైతులు, కౌలు రైతులను పరామర్శించారు. అధైర్యపడొద్దని, అండగా ఉంటామని భరోసానిచ్చారు.
రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా తదితర సమస్యలను ఆయన దృష్టికి రైతులు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి టీపీసీసీ హోదాలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ సర్కారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున నష్టరిహారం అందిస్తే అవి ఎటు సరిపోవని విమర్శించాడని, ఇప్పుడు రేవంత్‌రెడ్డే సీఎంగా ఉన్నారని రైతులకు ఎంత నష్టపరిహారం చెల్లిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటివరకూ గ్రామాలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, మంత్రులు వచ్చి పరిశీలించలేదని,ఒక్క ఎకరాన్ని కూడా సర్వే చేయలేదని బాధిత రైతులే చెబుతున్నారని అన్నారు.
కనీసం రైతుబంధు కూడా వేయకుండా రైతులను బాకీల పాలు చేసిందని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. గ్రామాల్లో వరద ఉధృతికి పత్తి, సోయా, కంది పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఒకో ఎకరానికి రూ.40 వేల నుంచి రూ.50 వేల నష్టం వాటిల్లిందన్నారు. కనీసం ఇలాంటి విపతర పరిస్థితుల్లోనైనా రైతులకు ఎకరానికి రూ.25 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఆయన వెంట గండ్రత్ రమేశ్, సెవ్వా జగదీశ్, పరమేశ్వర్, బట్టు సతీశ్, కుమ్ర రాజు, కనక రమణ, దేవీదాస్, ఆత్మ వెంకటేశ్, కిరణ్, అఖిలేశ్, దత్తు, కాడే నవీన్, మోతీరామ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
తలమడుగు, ఆగస్టు 22 : తలమడుగు మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలతో పాటు దెబ్బతిన్న పంటలను ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా పరిశీలించారు. కొత్తూరు శివారులో దెబ్బతిన్న పత్తి చేలను పరిశీలించి, రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అధికారులు సర్వే చేసి నివేదికను ప్రభుత్వానికి పంపించనున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట డీఏవో శ్రీధర్ స్వామి, అధికారులున్నారు.