బజార్ హత్నూర్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో(Union Budget) తెలంగాణకు అన్యాయం జరిగిందని అదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ(Congress) అధ్యక్షులు జల్కె పాండు రంగ్ అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని గాంధీనగర్ కాలనీలోని అంబేద్కర్ విగ్రహనికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పాండు రంగ్ మాట్లాడుతూ.. బడ్జెట్లో అదిలాబాద్ జిల్లాకు చట్టబద్ధంగా రావాల్సిన నిధులు రాలేదన్నారు. ప్రత్యేకంగా జిల్లాకు రావాల్సిన ఆర్మూర్ -ఆదిలాబాద్ రైల్వే లైన్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా, హైదరాబాద్ -నాగపూర్ పారిశ్రామిక కారిడార్‌కు అనుమతులు ఇవ్వకపోవడంపై మండిపడ్డారు.
అలాగే అటవీ, పర్వత ప్రాంతాలలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకానికి నిధులు విడుదల చేయక పోవడానికి నిరసించారు. ఉపాధి హామీ పథకానికి గతంలో కంటే తక్కువ నిధులు కేటాయించడం, ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడులు పెంచకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్లో సవరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బోత్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోరెడ్డి నారాయణ, నాయకులు ఈర్ల శివుడు, అరె పాండు, మేకల కిషన్, చట్ల నగేష్, నర్సయ్య, నరేష్, సోషల్ మీడియా కన్వినర్ దినేష్, సందీప్, విజయ్, రమణ, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.