చెన్నూర్ రూరల్, సెప్టెంబర్ 22 : చెన్నూర్‌లో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయి. ఇసుక.. రేషన్ బి య్యం అక్రమ రవా ణా.. చెరువుల కబ్జా.. ఇలా ఏ దందాలో చూసినా వారి ‘హస్తం’ఉంటుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇల్లీగల్ దందాలేకాక అధికారులను సైతం వేధింపులను గుర్తి చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల పొన్నారం గ్రామపంచాయతీ కార్యదర్శిని, అదే గ్రామానికి చెందిన ఇద్దరు కాంగ్రెస్ లీడర్లు తప్పుడు దరఖాస్తుపై సంతకం చేయాలంటూ తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లు తెలిసింది.
ఆమెతో అసభ్యకంగా ప్రవర్తిస్తూ విధులకు ఆటంకం కలిగించినట్లు ఆ ఊరి ప్రజలు చెబుతున్నారు. 2022లో పొన్నారం గ్రామానికి చెందిన బాలికకు, కోటపల్లి మండలం దేవులవాడ గ్రామానికి చెందిన ఓ యువకుడికి ప్రేమ వివాహమైంది. ఆ సమయంలో సదరు బాలిక మైనర్ కావడంతో కల్యాణలక్ష్మి పథకానికి అనర్హురాలైంది. ఇటీవల మేజర్ కావడంతో కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసుకున్నది. దీంతో స్థానిక కార్యదర్శి గ్రా మంలో విచారణ చేపట్టారు. కల్యాణలక్ష్మి దరఖాస్తు చేసుకున్న యువతికి రెండేళ్ల క్రిత మే వివాహమైందని, ఏడాదిన్నర బాబు సైతం ఉన్నాడని విచారణలో తేలింది.
దీంతో దరఖాస్తుపై పంచాయతీ కార్యదర్శి సంతకం చేయలేదు. ఈ విషయం తెలుసుకున్న హస్తం పార్టీ లీడర్లు అప్లికేషన్ మీద సంతకం చేయాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సంతకం చేయనని ఆమె తేల్చి చెప్పడంతో నాయకులు అందరి ముందే అసభ్యంగా మాట్లాడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శి చెన్నూర్ ఎంపీడీవో, ఎంపీవో దృష్టికి తీసుకెళ్లింది. వారి సూచన మేరకు వారం క్రితం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వారం రోజుల్లో ఏం జరిగిందో తెలియదుకానీ.. శనివారం పంచాయతీ సెక్రటరీ వచ్చి కేసు వాపస్ తీసుకుందని చెన్నూర్ సీఐ రవీందర్ తెలిపారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శిని ఫోన్లో వివరణ కోరేందుకు యత్నించగా ఆమె స్పందించలేదు. హస్తం పార్టీ లీడర్ల తీరుపై చెన్నూర్ జనాలు మండిపడుతున్నారు.
కనీసం మహిళ అని చూడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎమ్మెల్యే గడ్డం వివేక్ సదరు నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొందరు లీడర్లు అక్రమ దందాలు చేస్తూ, అధికారులను వేధిస్తూ పార్టీకి చెడ్డపేరు తీసుకువస్తున్నారని ఆ పార్టీ నాయకులే మండిపడుతున్నారు. ఎమ్మెల్యే స్థానికంగా అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా మారిందని, ఎవరికీ భయం లేకుండా పోతున్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.