ఎదులాపురం, జూలై 21 : మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సీ రాంచంద్రారెడ్డి అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని తిర్పెల్లి శ్మశానవాటికలో నిర్వహించారు. ఉదయం శాంతినగర్‌లోని ఆయన నివాసానికి వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు, ఆయా పార్టీల నాయకులు తరలివచ్చారు. ఆయన భౌతికకాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లో ఇంద్రకరణ్‌రెడ్డి, ఆదిలాబాద్, బోథ్, మంచిర్యాల ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావ్, నడిపెల్లి దివాకర్‌రావు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే అరవింద్, మహారాష్ట్ర ఎమ్మెల్యేలు, టీఎస్ ఐడీసీ చైర్మన్ వేణుగోపాలాచారి, డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి, టీడీడీసీ మాజీ చైర్మన్ లోక భూమారెడ్డి, మాజీ మంత్రి గడ్డం వినోద్, మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్, కాంగ్రెస్ సీనియర్ నేత హన్మంత్‌రావు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు, జిల్లా అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, టీపీసీసీ జిల్లా అధ్యక్షురాలు గండ్రత్ సుజాత, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, మహిళా నాయకురాలు సుహాసిని రెడ్డి, జడ్పీటీసీలు అనిల్‌జాదవ్, చారులత, గోక గణేశ్‌రెడ్డి సహా వేలాది మంది భారీ వర్షంలో కూడా అంతిమయాత్రలో పాల్గొన్నారు. సీఆర్ఆర్ స్వగ్రామం తలమడుగు మండలం ఖోడద్ సహా వివిధ గ్రామాల నుంచి ప్రజలు కడసారి చూసేందుకు తరలివచ్చారు. 70 గ్రామాల నుంచి స్వచ్ఛందంగా వచ్చిన డప్పులతో అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
శాంతినగర్‌లో సీఆర్ఆర్ భౌతికకాయానికి ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి పుష్పగుచ్చాలు అర్పించారు. తిర్పెల్లి శ్మశానవాటికలో గౌరవ వందనం సమర్పించారు. పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు. సీఆర్ఆర్ భార్య, కుటుంబ సభ్యులను మంత్రి ఐకే రెడ్డి, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు ఓదార్చారు.
కాగా, సీఆర్ఆర్ అంత్యక్రియలకు వచ్చిన మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్క రాజేశ్వర్ ఆకస్మికంగా మృతిచెందాడు. శాంతినగర్‌లోని సీఆర్ఆర్ ఇంటిఎదుట అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు. కొందరు గుండెపోటుగా భావించి, సీపీఆర్ చేశారు. రిమ్స్‌కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.