ఆదిలాబాద్, సెప్టెంబర్ 13(నమస్తే తెలంగాణ) : భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి జోగు రామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆదిలాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వాతావరణ పరిస్థితుల కారణంగా రైతులు సాగులో ఇబ్బందులు పడుతుంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం యూరియాను అందించలేని పరిస్థితుల్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలను నష్టపోయిన రైతులకు అండగా నిలిచిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు.
అన్నదాతలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలను రాజకీయం చేయడం మానుకోవాలని సూచించారు. పంటలు నష్టపోయి రైతులు ఆందోళన చెందుతుంటే బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలను నష్టం వివరాలను కేంద్రానికి ఎందుకు తెలియజేయలేదని ప్రశ్నించారు. తెలంగాణ కేంద్ర ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోకపోవడం సిగ్గు చేటన్నారు.
ఆదిలాబాద్ నుంచి రైతుల సమస్యల కోసం ఉద్యమానికి శ్రీకారం చుడుతామని కేటీఆర్, హరీశ్‌రావులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడుతుమన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు సాజిదొద్దీన్, అజయ్, గోవర్ధన్, రాజన్న, ధమ్మపాల్, బట్టు సతీశ్, లక్ష్మణ్, దయానంద్, సురేందర్, ముఖీమ్, నరేశ్, ఆలం, మహేశ్, సాయికృష్ణ పాల్గొన్నారు.