బీఆర్ఎస్ సర్కారు అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు రూపొందించి అమలు చేయగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కోదానిపై క్రమంగా చేతులెత్తేస్తున్నది. కేసీఆర్ కుల వృత్తులకు జీవం పోసి, ఆయా వర్గాలకు ఉపాధి చూపగా, ఇప్పుడున్న ‘హస్తం’ పార్టీ తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికే గొర్రె పిల్లల పంపిణీని అటకెక్కించగా, ఇక చేపల పెంపకంపైనా అలసత్వం ప్రదర్శిస్తున్నది. గత పాలనలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏటా 9.31 కోట్ల చేప పిల్లలను జలాశయాల్లో విడుదల చేయగా, ఈ ఏడాది కేవలం 5.49 కోట్లే వేయడం విమర్శలకు తావిస్తున్నది.
– మంచిర్యాల, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
సాధారణంగా యేటా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెల ప్రారంభంలో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరుల్లో చేపపిల్లలను వదలాలి. కానీ, ఈ ఏడాది చేప పిల్లలు పంపిణీ చేసే టెండర్ దారులు ఎవ్వరూ ముందుకు రాలేదు. పాత బకాయిలు సర్కారు విడుదల చేయకపోవడంతో టెండర్ వేసేందుకు నిరాసక్తి చూపించారు. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. రెండు నెలలుగా పలుమార్లు టెండర్ల గడువు పెంచినా ఫలితం లేకుండా పోయింది. దీంతో కొత్త కాంట్రాక్టర్లు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. అనేక తర్జన, భర్జనలు, వాయిదాల అనంతరం ఎట్టకేలకు అక్టోబర్‌లో చేప పిల్లల పంపిణీకి టెండర్లు ఖరారయ్యాయి. వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో దానిపైనా నీలినీడలు కమ్ముకున్నాయి. ఎన్నికలు ఆగిపోయిన నేపథ్యంలో చివరకు నవంబర్ 4న నుంచి రాష్ట్రవ్యాప్తంగా చేపపిల్లల పంపిణీని ప్రారంభించారు. సాధారణంగా జూలై, ఆగస్టు నెలల్లో వేస్తే.. ఫిబ్రవరి, మార్చి నెలల నాటికి అవి ఎదిగేవి. వర్షాలకు వచ్చే కొత్త నీరుతో సమృద్ధిగా ఆహారం దొరికి ఆరు నెలల కాలంలో ఒక్కో చేప మూడు నుంచి నాలుగు కిలోల బరువు పెరిగేది. కానీ, ఈసారి నవంబర్‌లో చేప పిల్లలు వదులుతున్నారు. చేపలు పట్టే కాలం ఫిబ్రవరి, మార్చి నాటికి మూడు, నాలుగు నెలల సమయం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత వేసవి కాలం వచ్చి చేపలు బతికే ఛాన్స్ ఉండదు. దీంతో ఇంత తక్కువ సమయంలో చేపపిల్లలు పెరగడంపై సందేహాలున్నాయి. అదను దాటాక చేప పిల్లలు వదిలి ఏం లాభమంటూ మత్స్యకార సంఘాలు, మత్స్యకారులు మండిపడుతున్నారు. మత్స్యకారులను ఈ సర్కారు చిన్నచూపు చూస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఏడాదనే కాదు… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరం (గతేడాది) సైతం అనుకున్న స్థాయిలో చేపపిల్లల పంపిణీ చేపట్టలేదు. లక్ష్యానికి.. వదిలిన పిల్లల సంఖ్యకు సంబంధం లేదు. పోయినేడాది మంచిర్యాల జిల్లాలో 1.09 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా, కేవలం 29.09 లక్షల చేప పిల్లలను మాత్రమే వదిలారు. నిర్మల్ జిల్లాలో 4.50 కోట్లకు 2.20 కోట్లు, ఆసిఫాబాద్ జిల్లాలో 1.30 కోట్లకు 47.38 లక్షలు, ఆదిలాబాద్ జిల్లాలో కేవలం 80 లక్షల చేపపిల్లలను మాత్రమే వదిలారు. కాకపోతే పోయినేడాది పరిస్థితి ప్రస్తుతం లేదు. ఈ సారి భారీ వర్షాలు, వరదలు వచ్చి నీటి వనరుల్లో పుష్కలంగా నీరు ఉంది. కానీ చేప పిల్లల పంపిణీ దాదాపు మూడు నెలలు ఆలస్యమైంది. నీరు పుష్కలంగా ఉన్నా చేపపిల్లల పంపిణీ లక్ష్యాన్ని తగ్గించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ సర్కార్ హయాంలో సీజన్ ప్రారంభంలోనే ఠంచన్‌గా చేపపిల్లలు పంపిణీ చేసేవారు. మత్స్యకారులు వ్యాపారం చేసుకోడానికి వీలుగా రవాణా వాహనాలు(ట్రాలీలు), వీధి వ్యాపారుల కోసం మోపెడ్స్(స్కూటీ)లు, కియోస్కోలు(నీడనిచ్చే టెంట్లు), వలలు, ఇతర పరికరాలు సబ్సిడీపై పంపిణీ చేసేవారు. ఇప్పటికీ ఆ ఫలాలు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నా, కాంగ్రెస్ సర్కార్ పట్టింపులేమితో పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని మత్స్యకారులు చెబుతున్నారు. చేపపిల్లల పంపిణీనే సరిగా చేపట్టలేకపోయిన సర్కారు, రానున్న రోజుల్లో మత్స్యకారులను ఆదుకోవడం కష్టమేనంటూ పలువురు వాపోతున్నారు. మరి ఈ ఏడాది పెట్టుకున్న లక్ష్యం చిన్నదే అయినా.. ఆ మేరకైనా చేపపిల్లలు వదలాలని, వచ్చే ఏడాది నుంచి జిల్లా అవసరాలకు సరిపడా చేపపిల్లలు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కేసీఆర్ సర్కారు ఉపాధి చూపి మా బతుకుల్లో వెలుగులు నింపింది. చేపపిల్లల పంపిణీ చేయడంతో పాటు అవసరమైన వసతులు కల్పిం చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మా బతుకులు అధ్వానంగా మారాయి. ప్రతి సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే జలాశయాల్లో చేప పిల్లలను తప్పనిసరిగా వేయాలి. సమయానికి చేప పిల్లలు వేస్తే ఫిబ్రవరి, మార్చి నెలల నాటికి పెరుగుతాయి. కానీ, ఈసారి ఆలస్యంగా వేశారు. దిగుబడి ఆశించిన స్థాయిలో రావడం కష్టమే..
– బోరె యాదగిరి, ఎన్ఎఫ్సీఎల్ఎస్ డైరెక్టర్ (మంచిర్యాల జిల్లా)