నిర్మల్, నవంబర్ 4(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లావ్యాప్తంగా వివిధ శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులు చెల్లించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో కన్నెర్ర జేస్తున్నారు. రెండేళ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, నీటిపారుదల శాఖ, మున్సిపల్, గిరిజన సంక్షేమ శాఖలతోపాటు ఇతర శాఖల పరిధిలో పనులు చేసిన కాంట్రాక్టర్లు తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయా శాఖల పరిధిలో చేపట్టిన పనులు పూర్తయినప్పటికీ రెండేళ్లుగా ప్రభుత్వం నయాపైసా చెల్లించకపోవడంతో చాలా మంది అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఇక ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుందామన్న నిర్ణయానికి వచ్చారు. ఈ నెల 30వ తేదీలోగా పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే డిసెంబర్ నుంచి ప్రస్తుతం కొనసాగుతున్న పనులు నిలిపివేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. భవిష్యత్‌లో ప్రభుత్వం మంజూరు చేసే కొత్త పనులు చేపట్టేందుకు టెండర్లు వేయబోమంటూ తమ నిరసన తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్మల్‌లోని కలెక్టరేట్ కార్యాలయానికి భారీగా తరలివచ్చిన కాంట్రాక్టర్లు అడిషనల్ కలెక్టర్ కిశోర్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు.
నిర్మల్ జిల్లావ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా ప్రభుత్వం కాంట్రాక్టర్ల కు బకాయి ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా దాదాపు రూ.2 వేల కోట్ల వరకు పెండింగ్ బకాయిలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఇందులో ప్రధానంగా పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, నీటిపారుదల శాఖల పరిధిలో చేపట్టిన పనుల బకాయిలు ఉన్నట్లు సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ పనుల పెండింగ్ బిల్లులు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించిన ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ పథకం కింద పాఠశాలల్లో చేసిన పనుల బిల్లులను చెల్లించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. బీఆర్ఎస్ హయాంలో జరిగిన పనుల బిల్లులను చెల్లించకుండా కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదన్న ఆరోపణలు ఉన్నాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంట్రాక్టర్ల పరిస్థితి అధ్వానంగా మారింది. కొంతమంది కాంట్రాక్టర్లు అప్పులు చేసి పనులు పూర్తి చేశారు. ప్ర స్తుతం వారు చేసిన అప్పులకు వడ్డీలు కట్టే పరిస్థితి లేదు. ప్ర భుత్వం నుంచి బిల్లులు రాక, మానసిక ఒత్తిడికి గురై ఇటీవల ఆదిలాబాద్‌లో యువ కాంట్రాక్టర్ ప్రవీణ్ గుండెపోటుతో మరణించిన సంగతి అందరికి తెలిసిందే. పెండింగ్ బిల్లుల కోసం తమ సంఘం ఆధ్వర్యంలో ఇప్పటికే సీఎంతోపాటు మంత్రులను కలిసి విన్నవించినం. కలిసిన ప్రతిసారి త్వరలోనే ఇస్తమని చె బుతున్నారే తప్ప అది ఆచరణలో జరగడం లేదు. దీంతో విసిగి వేసారిన తాము ఇక ప్రభుత్వం తో పోరాడాలని నిర్ణయం తీసుకున్నాం. పెండింగ్ బిల్లుల చెల్లింపు కోసం ఈనెల 30వ తేదీ వర కు ప్రభుత్వానికి గడువు ఇస్తున్నాం. ఆలోగా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే డిసెంబర్లో జరుగుతున్న అభివృద్ధి పనులు నిలిపివేస్తాం. అలాగే కొత్త పనులను కూడా చేపట్టబోం. ప్రస్తు త కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా హ్యామ్ రోడ్ల ప్రతిపాదనలు తెస్తున్నది. ఈ రోడ్లను నిర్మించేందుకు మొబిలైజేషన్ ఫండ్స్ కింద అడ్వాన్స్‌గా 10 శాతం నిధులను కేటాయిస్తున్నది. అసలు డబ్బులే లేవని చెబుతున్న ప్రభుత్వం పాత పనుల పెండింగ్ బిల్లులను చెల్లించకుండా, కొత్తగా వేసే హ్యామ్ రోడ్ల కాంట్రాక్టర్లకు అడ్వాన్స్‌లు ఇవ్వడం ఎంతవరకు సమంజసం. ముందు పాతవి చెల్లించన తర్వాతే కొత్తవాటికి నిధులు ఇవ్వాలి. ఇప్పటికైనా ప్రభు త్వం పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాలి. లేకుంటే తమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతాం.