నిర్మల్, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలో పామాయిల్ పరిశ్రమ ఏర్పాటుకు రాజకీయ గ్రహణం పట్టుకున్నది. కేసీఆర్ ప్రభుత్వం రైతులను లాభాల బాట పట్టించేందుకు ఆయిల్ పామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా మొదటి దశలో దాదాపు 3,500 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలను సాగు చేశారు. వచ్చే మూడు నెలల్లో మొదటి దశలో నాటిన మొక్కల గెలలు కోతకు రానున్నాయి. ఇంత వరకు బాగానే ఉన్నా.. పంటను ఎక్కడ అమ్ముకోవాలనే విషయంలో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో ముందు నుంచి ఆయిల్‌పామ్ తోటల సాగుతోపాటు కొనుగోలు బాధ్యతను ప్రీ యూనిక్ ఇండియా లిమిటెడ్ కంపెనీ తీసుకున్నది.
ఇందులో భాగంగానే సోన్ మండలంలోని పాక్పట్ల వద్ద పామాయిల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు ఈ కంపెనీ యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసింది. 2023లోనే అప్పటి బీఆర్ఎస్ మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డిలు ఫ్యాక్టరీ పనులకు శంకుస్థాపన చేశారు. నిర్మల్ జిల్లాతోపాటు పక్క జిల్లాల్లోని రైతులు సాగు చేసే ఆయిల్‌పామ్ ఉత్పత్తులను తమ కంపెనీ కొనుగోలు చేసి, ఇక్కడి పరిశ్రమలోనే ఆయిల్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు అప్పట్లో ప్రీ యూనిక్ కంపెనీ ప్రకటించింది.
దీంతో స్థానికంగానే పంట దిగుబడులను విక్రయించుకునే వెసులుబాటు ఉండడంతో జిల్లా రైతులు పెద్ద సంఖ్యలో సాగుకు ముందుకొచ్చారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 8,200 ఎకరాల్లో మొక్కలను పెంచుతున్నారు. అయితే పామాయిల్ పరిశ్రమ నిర్మాణానికి ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో మార్కెటింగ్‌పై ఆందోళన మొదలైంది. రైతులకు అండగా నిలవాల్సిన నాయకులు పరిశ్రమ ఏర్పాటుకు అడ్డంకులు సృష్టిస్తుండడంపై వారు మండి పడుతున్నారు. ఈ క్రమంలో కొత్తగా ఆయిల్ పామ్ సాగు చేయాలనుకుంటున్న రైతులు వెనకడుగు వేస్తున్నారు.
సోన్ మండలంలోని పాక్పట్ల గ్రామం వద్ద 2023 అక్టోబర్ 4న ప్రీ యూనిక్ సంస్థ పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు భూమి పూజ చేసింది. ఈ కార్యక్రమానికి అప్పటి మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు కంపెనీ పనులు మొదలు కాకపోవడంపై రాజకీయ నాయకుల్లో సమన్వయం లేకపోవడమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇరిగేషన్ అనుమతులు లేవన్న కారణాన్ని సాకుగా చూపుతూ తన అనుమతి లేకుండా ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్ట వద్దని సదరు కంపెనీ యాజమాన్యాన్ని హెచ్చరించినట్లు నియోజకవర్గ స్థాయిలో కీలక పదవిలో ఉన్న ప్రజాప్రతినిధిపై ఆరోపణలు ఉన్నాయి.
అయితే ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మాణానికి 40 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన ప్రీ యూనిక్ కంపెనీ.. ప్రస్తుతం ఎలాంటి అభ్యంతరం లేని 2.25 ఎకరాల భూమికి ఎన్వోసీ మంజూరు చేయాలని నీటి పారుదల శాఖకు విన్నవించింది. ఇప్పటికే ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించి తమ వద్ద అన్ని అనుమతులు ఉన్నాయని, కేవలం ఇరిగేషన్ శాఖ నుంచి ఒక్క ఎన్వోసీ ఇప్పిస్తే పనులు మొదలు పెడతామని కంపెనీ ప్రతినిధులు ఇటీవలే కలెక్టర్‌ను కలిసి స్పష్టం చేసినట్లు సమాచారం. అధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో పామాయిల్ పరిశ్రమ ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ యాజమాన్యంపై ఇక్కడి రాజకీయ నాయకుల నుంచి వస్తున్న ఇబ్బందులను భరించలేక పరిశ్రమను నిజామాబాద్ జిల్లాకు తరలించేందుకు యత్నిస్తున్నట్లు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని నందిపేట్ ప్రాంత రైతులు పరిశ్రమ ఏర్పాటు చేస్తే స్వచ్ఛందంగా భూములిస్తామని కంపెనీ యాజమాన్యానికి హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయంలో ప్రీ యూనిక్ కంపెనీ కొంత సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఇదే జరిగితే నిర్మల్ జిల్లా నుంచి విలువైన, వందలాది మందికి ఉపాధి కల్పించే పామాయిల్ పరిశ్రమ తరలిపోయే ప్రమాదం ఉంది. రాజకీయాలు మాని రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పామాయిల్ పరిశ్రమ జిల్లా నుంచి తరలిపోకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.
రైతులను లాభాల బాట పట్టించడమే కాకుండా, ప్రత్యామ్నాయ సాగు వైపు దృష్టి సారించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించింది. అయిల్‌పామ్ సాగుకు ముందుకొచ్చిన రైతులకు సబ్సిడీతోపాటు డ్రిప్ ఇరిగేషన్ సదుపాయాన్ని కల్పించింది. నాలుగేళ్లపాటు పంట నిర్వహణ, ఎరువుల కోసం ఎకరానికి రూ.4200 చొప్పున అందించింది. సారంగాపూర్ మండలంలోని బీరవెల్లి వద్ద పెద్ద ఎత్తున నర్సరీని ఏర్పాటు చేసి ఆయిల్‌పామ్ మొక్కలను పెంచారు. రూ.200 విలువ గల మొక్కకు 180ల సబ్సిడీ ఇచ్చి కేవలం రూ.20లకే ఒక మొక్కను రైతులకు అందించింది. దీంతో నిర్మల్ జిల్లాలో పెద్ద సంఖ్యలో రైతులు ఆయిల్‌పామ్ తోటలను పెంచేందుకు ముందుకొచ్చారు. పరిశ్రమ నిర్మాణానికి అవసరమైన అనుమతులు ఇవ్వడంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో పరిశ్రమ పనులు నేటికీ ప్రారంభం కాలేదు.
నిర్మల్ జిల్లాలో వెంటనే పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే మా లాంటి ఆయిల్‌పామ్ రైతులకు భరోసా ఉంటుంది. తోటలను సాగు చేసేందుకు రైతులు కూడా ఇంకా పెద్ద సంఖ్యలో ముందుకొస్తారు. 2021 సంవత్సరంలో పదెకరాల్లో ఆయిల్‌పామ్ మొక్కలు నాటిన. ప్రస్తుతం చెట్లు పెద్దగైనయ్. పోయిన సంవత్సరమే కొన్ని చెట్లకు గెలలు వచ్చినయ్. మొదటి సారి వచ్చిన గెలలు తీసేయాలని అధికారులు చెప్పారు. ఈసారి వచ్చిన గెలలు పెద్దగా పెరిగినయ్. ఎకరానికి రెండు నుంచి మూడు టన్నుల దిగుబడి వస్తుందని అనుకుంటున్నా. ప్రస్తుతం టన్నుకు రూ.20 వేల వరకు ధర ఉంది. వచ్చే జూన్ నెలలో గెలలు పూర్తిగా కోతకొస్తాయి. గతంలో 15 ఏళ్లపాటు బతుకు దెరువు కోసం దుబాయిలో పని చేసిన. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నదని, పంటలకు ప్రోత్సాహమిస్తున్నదని తెలిసి ఐదేండ్ల కింద ఇండియాకు తిరిగి వచ్చిన. ఉన్న ఊరిలో వ్యవసాయం చేసుకుంటూ ఆనందంగా కుటుంబంతో కలిసి ఉంటున్న.
– గజ్జెల మల్లు, ఆయిల్‌పామ్ రైతు, ముజ్గి, నిర్మల్ మండలం.