వాంకిడి, సెప్టెంబర్ 11: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీల పథకాలను ఇంకెప్పుడు అమలు చేస్తారని కాంగ్రెస్ సర్కారును ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రశ్నించారు. బుధవారం వాంకిడి తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ రియాజ్ అలీ అధ్యక్షతన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మండలంలోని 62 మంది లబ్ధిదారులకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పంపిణీ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం తీసుకురావడంతో ఎంతో మంది నిరుపేద కుటుంబాలకు ఆడ పిల్లల పెండ్లిల భారం తగ్గిందని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీ పథకాల అమ లు చేయడంలో జాప్యం చేస్తున్నదన్నారు. రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీలు, దరఖాస్తుల పేరుతో కాలయాపన చేస్తూ రైతులను మోసం చేస్తున్నదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పీఏఎంసీ చైర్మన్ జబోరే పెంటు, మాజీ జడ్పీటీసీ అజయ్‌కుమార్, వాంకిడి మాజీ సర్పంచ్ బండే తుకారాం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుర్నులే నారాయణ, నాయకులు దీపక్ ముండే, ఆర్ఐ మాజీద్, తహసీల్ కార్యాలయ సిబ్బంది, కల్యాణలక్ష్మి లబ్ధిదారులు తదితరులు ఉన్నారు.
కెరమెరి/ఆసిఫాబాద్ టాన్, సెప్టెంబర్ 11: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఇవ్వాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. కెరమెరి మండల పరిషత్ కార్యాలయంలో 51 మంది లబ్ధిదారులు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆసిఫాబాద్ మండలానికి చెందిన 129 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.వేర్వేరు కార్యక్రమాల్లో కెరమెరి తహసీల్దార్ దత్తు ప్రసాద్‌రావు, ఎంపీడీవో మహ్మద్ అమ్జద్‌పాషా, మాజీ ఎంపీపీ పెందోర్ మోతీరాం, మాజీ జడ్పీటీసీ సెడ్మాకి దుర్పతాబాయి, మాజీ వైస్ ఎంపీపీ సయ్యద్ అబూల్ కలాం, నాయకులు కుమ్రం భీంరావ్, జగన్నాథ్రావ్, దందురావ్, ఆసిఫాబాద్ తహసీల్దార్ రోహిత్ దేశ్ పాండే, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ హైమద్, మాజీ సర్పంచులు భీమేశ్, బాబురావు, శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీలు రవీందర్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.