కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో గుణాత్మకమైన విద్య అందడం అటుంచి కనీసం పరిశుభ్రమైన వాతావరణం కూడా లేని దుస్థితి నెలకొన్నది. పేద విద్యార్థులకు మెరుగైన విద్య, నాణ్యమైన పౌష్టికాహారం అందించాల్సిన ఆశ్రమ పాఠశాలలు అధ్వానంగా మారాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుమ్ర భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారంతో అస్వస్థతకు గురైన వారిలో విద్యార్థిని శైలజ మృతి చెందిన నేపథ్యంలో బీఆర్ఎస్ యూత్ నాయకులు చేపట్టిన ‘గురుకులాల బాట’లో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి.
బుధవారం తిర్యాణి మండల కేంద్రంలోని బాలిక గురుకుల పాఠశాల, ఆశ్రమ పాఠశాలను బీఆర్ఎస్వీ నాయకులు సందర్శించారు. నాయకులు వస్తున్నారనే విషయం ముందుగా తెలుసుకున్న పోలీసులు ఆశ్రమ పాఠశాల వద్ద బందోబస్తు నిర్వహించారు. నాయకులను లోనికి వెళ్లనీయకుండా గేటు వద్దే అడ్డుకున్నారు. అతి కష్టం మీద పాఠశాలలోకి నాయకులు వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. నెలల తరబడి శుభ్రం చేయకపోవడంతో టాయిలెట్లు, మరుగుదొడ్లు, బాత్రూంలు కంపు కొడుతున్నాయి. వాటికి సరైన తలుపులు కూడా లేవు. బియ్యం సంచులపై పురుగులు పారుతున్నాయి. ఇది చూసి ఆశ్రమ పాఠశాల నిర్వహణపై బీఆర్ఎస్వీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నాయకుడు ముస్తఫా మాట్లాడుతూ విద్యార్థులకు సరిగ్గా ఉడకని భోజనం పెడుతున్నారని, బాత్రూంలు, టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉండి వినియోగించలేకుండా ఉన్నాయన్నారు. సెప్టిక్ ట్యాంకులకు వెళ్లే పైపులు సైతం పగిలి ఉండడంతో పాఠశాల ఆవరణ పూర్తిగా దుర్వాసన వస్తున్నదన్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఆశ్రమ పాఠశాలలో సమస్యలు పరిష్కరించకపోతే విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
అనంతరం మండల కేంద్రంలోని బాలిక గురుకులంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడ కూడా పోలీసులు అడ్డుకున్నారు. వారిని తప్పించుకొని లోనికి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. గురుకులాల బాట కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.