ఆదిలాబాద్, జనవరి 7(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఆసరా పింఛన్లను రూ.4 వేలకు పెంచుతామని ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో లబ్ధిదారుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో పింఛన్లను పెంచే విషయంలో ప్రస్తావవ వస్తుందని ఆశించినా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోకపోవడంతో లబ్ధిదారుల్లో నిరాశ మిగిలింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు అరకొర పింఛన్లు అందచేశారు. సమైక్య రాష్ట్రంలో వృద్ధులు పింఛన్ల కోసం ఎన్ని దరఖాస్తులు సమర్పించినా మంజూరు అయ్యేవి కావు. ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగినా పింఛన్లు రాకపోయేవి.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పింఛన్లతో అభాగ్యులకు చేయూత అందించింది. వృద్ధులు, వితంతువులు, గీత, చేనేత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, ఎంఆర్టీ, పైలేరియా, డయాలసిస్ బాధితులకు నెలకు రూ. 2016, దివ్యాంగులకు రూ.4016ను పంపిణీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేస్తే ఆసరా పింఛన్దారులకు ప్రయోజనం చేకూరుతుంది. సంక్రాంత్రి పండుగకైనా పింఛన్ల పెరుగుదల ప్రకటన వెలువడుతుందని ఆశించినా లబ్ధిదారులకు నిరాశే మిగిలింది. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీని అమలు చేయాలని వారు కోరుతున్నారు.
అప్పుడు కేసీఆర్ సారు పెంచి ఇచ్చిన రూ.2016 వస్తున్నాయి. కాంగ్రెస్ సర్కారు ఇస్తామన్న రూ.4 వేలు ఇప్పటిదాకా కండ్ల చూడలేదు. ఈ సర్కార్ మాట తప్పింది. పింఛన్ రూ.4 వేల మీద అందరికీ ఆశ ఉన్నది. కానీ.. కాంగ్రెస్ సర్కార్ మీద నమ్మకం పోయింది. పింఛన్లు పెంచుడు కూడా మరో కేసీఆర్ సార్ గద్దె ఎక్కినంకనే అని అంటున్నారు మా గ్రామస్తులు.
– రాథోడ్ బతాసిబాయి, పింఛన్ లబ్ధిదారు, భీంపూర్.
మాకు భూమి లేదు. రోజు కూలి చేయనిదే పూట గడవదు. నా భర్త కొన్నేళ్ల క్రితం మరణించాడు. ముగ్గురు ఆడపిల్లలతో బతుకు కష్టమైతంది. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు వచ్చిన రూ.2016 సాయంగా నిలుస్తున్నాయి. కేసీఆర్ సార్ సర్కారు సాయం బాగుండె. అప్పు సప్పు చేసి, కల్యాణలక్ష్మి, సాయంతోని ముగ్గురు ఆడపిల్లల పెండ్లిళ్లు చేసిన. ఇప్పుడు రూ.2016 పింఛనే దిక్కు. అది సరిపోతలేదు. సీఎం రేవంత్ సార్ రూ.4 వేలు ఎటుపోయినయో ఏమో? ఇప్పటికైనా సర్కార్ ఆలోచించాలి.
– చౌహన్ బేబీబాయి, వితంతు పింఛన్, లబ్ధిదారు, భీంపూర్