బజార్ హత్నూర్ : కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ రుణాల కోసం నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకోమని ప్రకటన విడుదల చేసిన విషయం విధితమే. దీంతో మండలంలోని 30 గ్రామ పంచాయతీల నుంచి రాజీవ్ యువ వికాసం రుణాల కోసం 2150 ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోగా అందులో నుంచి ఎస్సీలు 475, ఎస్టీలు, 871, బీసీలు 759, ఈబీసీలు 12, మైనారిటీలు 32, క్రిస్టియన్ మైనార్టీ ఇద్దరు దరఖాస్తులు చేసుకున్నారు. అయితే నిరుద్యోగులకు ప్రభుత్వం ఒక పక్క సిబిల్ స్కోర్ అంటు కోర్రి పెడితే మరో పక్క బ్యాంకర్లు 50 వేల వరకే రుణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అని, అది కూడా అన్ని విధాలుగా అర్హత ఉన్న వారికే ఇస్తామనే వాదనలు జోరుగా వినిపిస్తున్నాయి.
అయితే 50 వేలకు పైగా రుణం కోసం దరఖాస్తులు చేసుకున్న వారి పరిస్థితి ఏంటి అని దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు. ఎలాంటి ఉద్యోగ భృతి లేక తిరుగుతున్న యువతకు స్వయం ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం కింద దరఖాస్తులు చేసుకోవాలని ఆశ కల్పించి మళ్లీ నిరుద్యోగులు ఆశలపై అటు ప్రభుత్వం, ఇటు బ్యాంకర్లు నీళ్లు చల్లడంతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఇది పని చేసే ప్రభుత్వం కాదని, మాటలతో కాలయాపన చేసే ప్రభుత్వం అని నిరుద్యోగులు మండిపడుతున్నారు.