చెన్నూర్, జనవరి 21: ఇల్లు ఉన్నోళ్లకే ఇల్లు ఇస్తారా…? గరీబోళ్లకు ఇవ్వరా….? ఇదేమి ప్రభుత్వం…ఇదేక్కడి న్యాయం అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నూర్ పట్టణంలోని 17వ వార్డులో ప్రభుత్వ పథకాల లబ్దిదారుల ఎంపిక కోసం మంగళవా రం నిర్వహించిన వార్డు సభ రసాబాసగా జరిగింది. 308మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం 22మంది పేర్లనే అధికారులు చదివారు. ఈ 22 మం దిలో చాలా మందికి ఒక్కటికి మించి ఇండ్లు ఉన్నాయి. ఇందులో 10మంది వరకు మున్సిపాలిటీకి అనుబంధంగా. వెలుగులో పని చేసే వారు ఉన్నారు. దీంతో ఇండ్లు లేని పేదలను వదిలి..ఇండ్లు ఉండి మీ వద్ద పని చేసే వాళ్ల పేర్లనే రాస్తుకొని వస్తారా….? అంటూ మున్సిపాలిటీ కమిషనర్ మురళీ కృష్ణతో పాటు ఇతర అధికారులపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డులో తిరిగి ఇండ్లు లేని వా రికి, ఇండ్లు కూలిపోయిన వారికి ఇవ్వాలని, ఇండ్లు ఉన్నవారికే ఇవ్వడం ఏమిటని నిలదీశారు. ఇక్కడ వార్డు సభలు నిర్వహించవద్దం టూ మహిళలు అధికారులపై ధ్వజమెత్తారు. అర్హులైన వారికే ఇండ్లు మంజూరు చేస్తామని అధికారులు నచ్చజెప్పినా వినలేదు.
ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫొటో మరిచారు..
చెన్నూర్ రూరల్, జనవరి 21: చెన్నూర్ పట్టణంలో మంగళవారం నిర్వహించిన వార్డు సభల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే వివేక్ ఫొటోను అధికారులు మరిచారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప మఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫొటోలను మాత్రమే ఫ్లెక్సీ లో పెట్టారు. ఎమ్మెల్యే ఫొటో లేకుండానే అ న్ని వార్డుల్లో సభలను ప్రారంభించారు. గంట సేపటి తర్వాత అధికారులు ఎమ్మెల్యే ఫొటోలను తీసుకువచ్చి ఫ్లెక్సీల్లో అతికించి సభలను కొనసాగించారు. ఎమ్మెల్యే ఫొటోను మరిచిపోవడంపై పట్టణంలో చర్చనీయాంశమైంది.
ఆరు గ్యారెంటీలపై నిలదీత..
మందమర్రి రూరల్ జనవరి21: మండలంలోని మామిడిగట్టు, చిర్రకుంట, ఆదిల్పేట్, బొకలగుట్ట, అందుగులపేట్లో జరిగిన గ్రామసభల్లో ఆరు గ్యారెంటీలపై అధికారులను గామస్తులు నిలదీశారు. అందుగులపేటలో ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేర్లు లేకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. అర్హత ఉన్నప్పటికీ తమను ఎందుకు ఎంపిక చేయలేదని వాగ్వాదానికి దిగారు.
గుడ్లబోరి గ్రామంలో..
కౌటాల, జనవరి 21 : మండలంలోని గుడ్లబోరి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అర్హులైన వారి పేర్లు లేకపోవడంపై గ్రామస్తులు డీటీ మస్కుర్ అలీని ప్రశ్నించారు. ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కౌటల మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామసభకు వచ్చిన ప్రజలకు సరిపడా కుర్చీలు లేక కొందరు కింద కూర్చొవడం, మరికొందరు నిలబడడంతో అధికారులను డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కుమ్రం మాంతయ్య ప్రశ్నించారు. ఎంపీడీవో ప్రసాద్ స్పందించి వెంటనే రైతు వేదిక నుంచి అదనంగా కుర్చీలు తెప్పించారు. పలు గ్రామాల్లో సభల్లో రేషన్ కార్డులు, ఇందిరమ్మ పేర్ల కోసం అప్లికేషన్ ఫారాల కోసం ప్రజలు ఇబ్బంది పడ్డారు.
ఇంటి పన్ను కడితేనే రేషన్ కార్డు.. నంనూర్ కార్యదర్శి తీరుపై విమర్శలు
హాజీపూర్, జనవరి 21 : ఇంటి పన్ను చెల్లిస్తేనే ప్రభుత్వ పథకాలకు అర్హులని, వారి దరఖాస్తులనే తీసుకుంటామని గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇబ్బందులకు గురి చేస్తున్నదని హాజీపూర్ మండలంలోని నంనూర్ గ్రామస్తులు మంగళవారం ఆరోపించారు. గ్రామంలో కొంత మంది యువకులకు ఇటీవల కొందరికి వివాహాలు జరుగగా వారు రేషన్ కార్డు కోసం సంబంధిత పత్రాలతో గ్రామ కార్యదర్శిని కలువగా ఇంటి పన్ను బకాయిలు చెల్లిస్తేనే దరఖాస్తులు తీసుకుంటానంటూ దురుసుగా ప్రవర్తిస్తున్నదని తెలిపారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ గృహాల జాబితాలో కొందరు పేర్లు జాబితాలో లేక పో వడంపై లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేసున్నారు. మళ్లీ దరఖాస్తు ఇచ్చే వారు ఇంటి ప న్ను పూర్తిగా చెల్లిస్తేనే దరఖాస్తులు తీసుకుంటానని ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. సింగరేణి రిటైర్ ్డ కార్మికులకు రేషన్ కా ర్డు రాదని చెబుతున్నారు. మరోవైపు మంచిర్యాల ఎమ్మెల్యే పీఎస్ఆర్ మాత్రం రిటైర్డ్ సిం గరేణి కార్మికులకు రేషన్ కార్డును ఇస్తామని సమావేశాల్లో చెబుతుండడం గమనార్హం.
రీ సర్వే చేయాలి.. పోలంపల్లిలో ఆందోళన
భీమారం, జనవరి 21 : పోలంపల్లి గ్రామ పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్‌తో పాటు ప్రైవేట్ వ్యక్తులతో బాధ్యతా రాహిత్యంగా రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల సర్వే చేశారని, రీ సర్వే చేయాలంటూ గ్రామ సభలో ప్రజలు ఆందోళన చేశారు. 20 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్న తమకు ఇందిరమ్మ ఇండ్లతో పాటు రేషన్ కార్డుల్లో పేర్లు రాలేదని, అనర్హులను ఎలా ఎంపిక చేస్తారని తహసీల్దార్ సదానందంను గ్రామస్తులు నక్క తిరుపతి, నక్క వేణు ప్రశ్నించారు. గ్రామ సభను బహిష్కరించాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు. తహసీల్దార్ సదానందం నచ్చజెప్పినా వినలేదు. రీ సర్వే చేయాలని గ్రామస్తులకు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఖాజీపల్లి, కొత్తపల్లి, మద్దికల్, ఎల్కేశ్వరం గ్రామాల్లో అర్హుల పేర్లు జాబితాలో లేకపోవడంపై కొత్తపల్లి పంచాయతీ కార్యదర్శి వసుంధరపై అసహనం వ్యక్తం చేశారు. బూర్గుపల్లిలో ఎస్ఐ శ్వేత గ్రామ సభలో కుర్చొని బందోబస్తు నిర్వహించారు. సొంత కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీ పథకాలను నిలదీయడం గమనార్హం.
తహసీల్దార్‌కు షోకాజ్ నోటీసులు !
భీమారం మండల తహసీల్దార్ సదానందంకు షోకజ్ నోటీసులు కలెక్టర్ కుమార్ దీపక్ జారీ చేసినట్లు సమాచారం. ఆదివారం కలెక్టర్ కుమార్ దీపక్ భీమారం మండలంలోని పెర్కవాడ, ఆరెపల్లి గ్రామాల్లో రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా సర్వేను పరిశీలించారు. తహసీల్దార్ సదానందం విధులకు హాజరు కాలేదు. దీంతో కలెక్టర్ కుమార్ దీపక్ ఆదివారం ఈ మెయిల్ ద్వారా షోకాజ్ నోటీస్‌లు జారీ చేసినట్లు సమాచారం. కొంత కాలంగా భీమారంలో ఎంపీడీవో, తహసీల్దార్ కార్యలయ సిబ్బంది విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని గ్రామ యువత సైతం ఆందోళన చేసిన విషయం తెలిసిందే.
రెబ్బెన గ్రామసభలో అదనపు కలెక్టర్‌ను నిలదీసిన గ్రామస్తులు..
రెబ్బెన, జనవరి 21: రెబ్బెన మండల కేంద్రంలో, కిష్టాపూర్ గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అర్హుల పేర్లు లేవని, అనర్హులనే ఎంపిక చేశారని గ్రామస్తు లు ఆందోళనకు దిగారు. తిరిగి పారదర్శకంగా సర్వే నిర్వహించాలని, అసలైన లబ్ధిదారులను గుర్తించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. రెబ్బెన గ్రామ పంచాయతీలో ఇందిర మ్మ ఇండ్ల కోసం 1233 మంది లబ్ధిదారుల కు సంబందించిన దరఖాస్తులు రాగా 1197 మందికి సంబందించిన సర్వే నిర్వహించి 463 మంది అర్హులను అధికారులు గుర్తించి దానికి సంబంధించిన జాబిత గ్రామసభలో చదివి వినిపించగా జాబితాలో పేర్లు లేనివా రు ఆందోళనకు దిగారు. అక్కడే ఉన్న అదన పు కలెక్టర్(రెవెన్యూ) డెవిడ్, స్పేషల్ ఆఫీసర్ ప్రభాకర్‌ను సైతం గ్రామస్తులు నిలదీశారు.
గ్రామసభల్లో అధికారుల నిలదీత..
కన్నెపల్లి, జనవరి 21 : ప్రజాపాలన గ్రామసభలు కన్నెపల్లి, భీమిని మండలాల్లోని పలు గ్రామసభల్లో తమ పేర్లు జాబితాలో ఎందుకు రాలేదని అధికారులను గ్రామస్తులు నిలదీశారు. కన్నెపల్లిలో ఏర్పాటు చేసిన గ్రామసభకు వచ్చినా అర్హులను గుర్తించలేదని అధికారులు తమ ఇష్టారాజ్యాంగా లిస్టు తయారు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు గ్రామాల్లో టెంటు, కుర్చీలు సరిగ్గా ఏర్పాటు చేయకపోవడంతో అధికారులపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి శంకర్, ఎంపీడీవో గంగా మోహన్, శంకర్, తహసీల్దార్లు బికర్ణదాస్, శ్రావణ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
కామన్పెల్లిలో..
జన్నారం, జనవరి 21 : ‘మేము అర్హులైనప్పటికీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఎందుకు రాలేదు ? లిస్ట్‌లో మా పేర్లు ఎందుకు లేవు?అంటూ జన్నారం మండలంలోని కామన్పెల్లిలో తహసీల్దార్ రాజమనోహర్రెడ్డిని, తపాలాపూర్‌లో ఆర్ఐ గంగారాజా గ్రామస్తులు నిలదీశారు. రేషన్ కార్డుల లిస్టులో పేర్లు లేని వారు మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అనర్హులను గుర్తించి తొలగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శశికళ, ఏవో సంగీత, నాయబ్ తహసీల్దార్ రామ్మోహన్, పంచాయతీ కార్యదర్శులు, ఏఈవోలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పోలీసుల మోహరింపు..
తాండూర్, జనవరి 21 : ప్రభుత్వ పథకాలు అందిస్తామని ఘనంగా ప్రకటించిన ప్రభుత్వం.. అవి అందించక పోగా, తరచూ దరఖాస్తులు ఇవ్వాలని ప్రజల్ని కోరుతుండడంతో వారు విసిగి వేసారిపోయారు. ఇచ్చిన దరఖాస్తే ఎన్నిసార్లు ఇవ్వాలంటూ ఆగ్రహావేశాలు వెళ్లువెత్తాయి. ప్రజల్లో నిరసనలను గమనించిన ప్రభుత్వం నిర్వహించిన గ్రామసభల్లో భారీగా పోలీసులను మోహరించింది. సామాన్య జనం గొడవలు చేయకుండా, నిరసనలకు దిగకుండా పెద్ద ఎత్తున పోలీసులను దించి, గ్రామసభలను మమ అనిపించారు. ఆర్థికంగా, రవాణాపరంగా ప్రయాస తప్ప ఒరిగేదిలేదంటూ ప్రజలు తిట్టుకుంటూ వెళ్ల డం కనిపించింది. అధికారులు చేసిన తప్పి దం వల్ల తాము నష్టపోతున్నామని, ఇప్పటికే నాలుగైదుసార్లు దరఖాస్తులు ఇచ్చామని, పథకాలు తక్కువ దరఖాస్తులెక్కువ అన్న చందంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కల్వాడ గ్రామంలో..
దహెగాం, జనవరి 21: మండలంలోని కల్వాడ గ్రామంలో రేషన్ కార్డుల కోసం 120 మంది దరఖాస్తు చేసుకోగా అందులో కేవలం 30 మంది వచ్చాయని, ఇందిరమ్మ ఇండ్లకోసం 290 మంది దరఖాస్తు చేసుకోగా 100 మందికి కూడా రాలేదని గ్రామస్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైనప్పటికీ తమ పేర్లు ఎందుకు రాలేదని అధికారులను ప్రశ్నించారు. ఈ విషయం తెలుసుకొని పోలీసులు అక్కడికి చేరుకొని గ్రామస్తులను సముదాయించారు. ఎంపీడీవో రాజేందర్ స్పందిస్తూ ప్రస్తుత జాబితా పరిశీలన మాత్రమేనని అర్హులందరికీ అందిస్తామని హామీనిచ్చారు.
ఇందిరమ్మ కమిటీ రద్దు చేయాలని నిరసన
చింతలమానేపల్లి, జనవరి 21 : ఇందిరమ్మ కమిటీ రద్దు చేసి అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారితో కొత్త కమిటీ ఏర్పాటు చేయాలని మంగళవారం మండలంలోని బూరెపల్లిలో గ్రామసభలో గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. సుమారు 40 శాతం జనాభా కలిగి ఉన్నప్పటికీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక్కరిని కూడా ఇందిరమ్మ కమిటీలో తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర వర్గాలకు చెందిన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేసినట్లు ఆరోపించారు. ఇందిరమ్మ కమిటీ రద్దు చేసి కొత్త కమిటీ వేయాలని మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు గ్రామసభను అడ్డుకున్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరలోనే కొత్త కమిటీలు వేసేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. సభ వద్ద సీఐ ముత్యం రమేశ్ బందోబస్తు నిర్వహించారు. బాలాజీ అనుకోడలోనూ ఇందిరమ్మ ఇళ్ల కమిటీపై గ్రామస్తులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.