ఆదిలాబాద్, జూన్ 9(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో యాసంగి జొన్న కొనుగోళ్లు ముగిసినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రకటించారు. జిల్లాలో గోదాములు నిండిపోవడంతోపాటు వర్షాలు పడుతున్న నేపథ్యంలో కొనుగోళ్లను నిలిపివేస్తున్నామని, రైతులు వాహనాల్లో పంటను మార్కెట్ యార్డుకు, నేరుగా గోదాములకు తీసుకురావద్దని అధికారులు సూచించారు. యాసంగిలో 1.12 లక్షల ఎకరాల్లో జొన్న సాగు చేయగా.. 16 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తున్నదని అధికారులు అంచనా వేశారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో క్వింటాలుకు రూ.3669 మద్దతు ధర ఉండగా, ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధరతో జొన్నలు కొనుగోలు చేస్తుండడంతో కేంద్రాలకు భారీగా పంటను తీసుకొచ్చారు. ఆయా మార్కెట్ యార్డుల పరిధిలోని గ్రామాలవారీగా షెడ్యూల్ ప్రకటించి జొన్నలను కొనుగోలు చేపట్టారు.
పంట విక్రయానికి పడిగాపులు
కొనుగోళ్లలో జాప్యం జరగడంతో కేంద్రాలకు రైతులు భారీగా పంటను తీసుకొచ్చారు. ఫలితంగా కొనుగోళ్లలో సమస్యలు రావడంతో అధికారులు కొనుగోళ్లను 26కు పెంచారు. హమాలీల కొరత, కొనుగోలు చేసిన పంటను గోదాముల్లోకి తరలించడంలో జాప్యం కారణంగా రైతులు రోజుల తరబడి పంటను విక్రయించడానికి పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో కొనుగోళ్ల ప్రారంభంలో కాంటా చేసిన సంచులు లారీల్లో లోడ్ అయ్యేంత వరకు తక్పట్టీలు ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బంది పడ్డారు.
కలెక్టర్ సూచన మేరకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కాంటా రైతులకు ఎప్పుడికప్పుడు తక్పట్టీలు ఇవ్వడంతో సమస్య పరిష్కారమైంది. బోథ్ మార్కెట్ యార్డులో తమ పంటను కొనుగోలు చేయడం లేదంటూ రైతులు స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముందు కన్నీరు పెట్టారు. మార్కెట్ యార్డుల్లో పంట నిల్వలు పేరుకుపోవడంతో అధికారులు రైతులకు గన్నీ బ్యాంగులు అందించి పంటను వాహనాల్లో తీసుకురావాలని సూచించారు. దీంతో రైతులకు పంట అమ్మకంలో కొంత వెసులుబాటు లభించింది.
ఆరు లక్షల క్వింటాళ్ల సేకరణ
ఆదిలాబాద్ జిల్లాలో 16 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తున్నదని అధికారులు అంచనా వేయగా 26 కేంద్రాల్లో ఆరు లక్షల క్వింటాళ్ల పంటను సేకరించినట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. రైతులు ఆహారంగా ఉపయోగించుకున్న వ్యవసాయాధికారు ల లెక్కల ప్రకారం 4 నుంచి 5 లక్షల క్వింటాళ్ల పంట మిగిలే అవకాశాలున్నాయి. దీంతో అధికారులు అంచనాలపై రైతు సంఘాల నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్రాప్ బుకింగ్ సరిగా చేయకపోవడంతో కొనుగోళ్ల అంచనాలో సమస్య లు వస్తున్నాయని అంటున్నారు. క్రాప్ బుకింగ్ పకడ్బందీగా నిర్వహిస్తే అసలైన రైతు లు పంటను అమ్ముకొనే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.