ఆసిఫాబాద్ టౌన్, నవంబర్ 6 : సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తి విక్రయించి మద్దతు ధర పొందాలని, దళారులను నమ్మి మోసపోవద్దని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం ఆసిఫాబాద్ మండలం బూరుగూడ శివారులోని ఆర్ఎస్ జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రైతు కపాస్ కిసాన్ యాప్‌ను వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలోని 24 జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, కేంద్ర ప్ర భుత్వం మద్దతు ధర రూ. 8,110 ప్రకటించిందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మారెటింగ్ అధికారి అశ్వక్ అహ్మద్, వ్యవసాయ శాఖ అధికారి మిలింద్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు అలీబిన్ అహ్మద్, సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లుల నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు.
మారుమూల ప్రాంతాల గిరిజనులకు సేవలందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. నెస్లే సంస్థ ఆధ్వర్యంలో వరద ప్రభావిత గ్రామాల్లో 14 రకాల నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గురువారం మాలన్గొందిలో కలెక్టర్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొని గిరిజనులకు సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ అలీబిన్ అహ్మద్, నెస్లే ఇండియా లిమిటెడ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
నస్పూర్/ఆసిఫాబాద్ టౌన్, నవంబర్ 6 : వందేమాతర గేయం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 7న ఉదయం 10 గంటలకు నస్పూర్ కలెక్టరేట్‌తో పాటు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఓ ప్రకటనలో తెలిపారు.