కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : ప్రజావాణికి డుమ్మాకొట్టిన అధికారులపై కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సీరియస్ అయ్యారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్‌కు దాదాపు 20 శాఖలకుపైగా అధికారులు హాజరుకాకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు హాజరుకాకుండా కిందిస్థాయి ఉద్యోగులను పంపడమేమిటని మండిపడ్డారు. గైర్హాజరైన వారికి వెంటనే షోకాష్ నోటీసులివ్వాలని, గైర్హాజరుకు గల కారణాలపై సంజాయిషీ తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించడంలో ప్రజావాణికి ప్రత్యేకత ఉంది. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్‌కు స్వయంగా కలెక్టర్ హాజరవుతున్నా వివిధ శాఖల ఉద్యోగులు మా త్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెం ట్ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులో ఉండగా, చా లా కాలంగా గ్రీవెన్స్ జరుగలేదు. దీంతో ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు ఈ సోమవారం పెద్ద ఎత్తున గ్రీవెన్స్‌కు తరలివచ్చారు.
ప్రజ ల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించిన కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, ఆయాశాఖల అధికారులకు ఇచ్చేందుకు పి లువగా చాలా మంది గైర్హాజరయ్యారు. ఆయా శాఖల్లో కింది స్థాయిలో పనిచేసే సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లను పంపడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, జిల్లాలో గ్రీవెన్స్‌లో స్వీకరించిన దరఖాస్తులు 2,781 పెండింగ్‌లో మూలుగుతున్నాయి. గ్రీవెన్స్‌లో స్వీకరించిన అర్జీలు నెలల తరగబడి పెండింగ్‌లో ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యలు ఎప్పటికీ పరిష్కారమవుతాయో.. అసలు కావేమోనని ఆందోళన చెందుతున్నారు.