ఆ రెండు నెలల పసికూన
మీరు కులికే గద్దెలనడిగిందా
మీరు పోగేసే డబ్బు మూటల నడిగిందా
అడిగిందొక
మల్లన్న దర్శనమే కదా…
అడిగిందొక
పువ్వును దేవుడి పాదాల ముందుంచమనే కదా
పశువులు సిగ్గుపడేలా కాళ్లతో తన్ని
పసికూనతో పాటు రాజ్యాంగాన్ని ఖననం
చేశారు కదా
పసినవ్వుల్ని చిదిమేశారు కదా
పసిమొగ్గను తుంచేశారు కదా…
ఆ పసిపాపకేం తెలుసు
మీ ఒంట్లో కులం ప్రవహిస్తున్నదని
పాలు తాగే పసిబిడ్డ
కుల హత్యకు గురైతే
ఈ రాజ్యాన్ని ఏమని పిలువాలే?
సర్వసత్తాక గణతంత్ర కులాతీత
మతాతీత జన రాజ్యాంగమా
నీ ప్రవేశికను ఆ పాపతోపాటు పంపించేయి..
మదమెక్కిన కులం
బరితెగించి బుసలు కొడుతున్నది
ఆధిపత్యం పాదాల కింద
పసిబిడ్డ ప్రాణకేకలు విని
పూలే విగ్రహం కన్నీటితో తడిసింది
బిడ్డకియ్యాల్సిన పాలు
తల్లి కంటనీరై ఉబికొస్తుంటే
సావిత్రిబాయి పూలే విగ్రహం కదిలింది..
కుమ్మెర కేవలం ఒక విషాద ఘటన కాదు
ఆధిపత్య కుల అహంకారం
మానవత్వానికి మాయని గాయం
ఊర్లలోని వాడలన్నీ ఉప్పొంగాలిప్పుడు
ఊరూవాడ కలిసి
ఆధిపత్య కొమ్ములు విరిచే పాటలు పాడాలిప్పుడు..
గౌరవ ముఖ్యమంత్రి.. మీ కామారెడ్డి డిక్లరేషన్
బీసీలను కాటికి పంపే డిక్లరేషనా?
మీ పెత్తనాలకు ఇక అంతం పలికే రోజు వచ్చింది
ఇక కలతలు వద్దని
ఇది కన్నీళ్లతోనే రాస్తున్న
బడుగుల యుద్ధకావ్యాన్ని ఆవిష్కరిస్తున్న
– జూలూరు
గౌరీ శంకర్