ఆదిలాబాద్ : జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో ఏ విధమైన ఆస్తి నష్టం కలగకుండా అధికారులు హెడ్ క్వార్టర్ లోనే ఉండి పర్యవేక్షించాలని తెలిపారు. వర్షాల కారణంగా ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వర్షాల వలన వరదలు, వంకలు ఉప్పొంగిపోతే రోడ్లు, వంతెనలు దాటేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
నాలాలో పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి డ్రైనేజీ నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. శిథిలావస్థకు చేరిన పాత ఇళ్లు వర్షాలకు నాని కూలిపోయే అవకాశం ఉన్నందున అక్కడ నివసించే వారిని ఖాళీ చేయించాలని, ఐరన్ విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు ట్రాన్స్ఫార్మర్ల వల్ల జరిగే ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని, రోడ్లపై ప్రమాదకరంగా ఏర్పడిన గుంతలను పూడ్చాలని ఆదేశించారు. మున్సిపల్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
అగ్నిమాపకశాఖ ఆధ్వర్యంలో ఆపదమిత్ర శిక్షణ పొందిన వలంటీర్లను వినియోగించుకోవాలని, సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉండడంతో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది అందుబాటులో ఉండాలని, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరచాలని, అత్యవసర పరిస్థితుల్లో 18004251939 కంట్రోల్ నెంబర్ కు కాల్ చేయాలని ప్రజలను జిల్లా కలెక్టర్ కోరారు.