Tilak Varma |టీమిండియా యువ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ రీ ఎంట్రీలోనే తన ప్రతిభను చాటుకున్నాడు. శస్త్రచికిత్స కారణంగా ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు దూరమైన ఈ ఎడమచేతి బ్యాట్స్‌మన్ ఇప్పుడు పూర్తిస్థాయి మ్యాచ్ ఫిట్నెస్ సాధించి మైదానంలోకి అడుగుపెట్టాడు. టీ20 వరల్డ్‌కప్ 2026కు ముందు జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా భారత్-ఏ జట్టు తరఫున యూఎస్ఏపై బరిలోకి దిగిన తిలక్ వర్మ చురుకైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అతని ప్రదర్శన భారత జట్టుకు మంచి సంకేతంగా మారింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్ వర్మ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. కేవలం 24 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు సాధించాడు.
ముఖ్యంగా షాట్ల ఎంపిక, స్ట్రైక్ రొటేషన్‌లో అతని నైపుణ్యం స్పష్టంగా కనిపించింది. గాయానంతరం ఎలాంటి అసౌకర్యం లేకుండా బ్యాటింగ్ చేయడంతో పాటు ఫీల్డింగ్‌లోనూ చురుకుగా కదిలి తన ఫిట్‌నెస్‌పై సందేహాలకు చెక్ పెట్టాడు. టీ20 వరల్డ్‌కప్ దృష్ట్యా అతని ఈ ఫామ్ భారత జట్టుకు పెద్ద ఊరటనిచ్చే అంశంగా మారింది. మ్యాచ్ విషయానికి వస్తే భారత్-ఏ జట్టు 38 పరుగుల తేడాతో యూఎస్ఏపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్-ఏ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్ జగదీశన్ అద్భుత శతకంతో మెరిశాడు. అతను 55 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 104 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేశాడు. కెప్టెన్ ఆయుష్ బదోని కూడా దూకుడుగా ఆడి కేవలం 26 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయంగా 60 పరుగులు సాధించాడు. మధ్యలో తిలక్ వర్మ వేగవంతమైన ఇన్నింగ్స్ జట్టుకు మరింత ఊపునిచ్చింది.
239 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఎస్ఏ జట్టు ప్రారంభంలో కొంత పోరాటం చూపించినప్పటికీ చివరికి భారత బౌలర్ల ముందు నిలవలేకపోయింది. 19.4 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. యూఎస్ఏ బ్యాటర్లలో అండ్రీస్ గాస్ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, సంజయ్ కృష్ణమూర్తి 41 పరుగులు చేశాడు. అయితే భారత బౌలింగ్ దాడిని ఎదుర్కోవడంలో వారు విఫలమయ్యారు. భారత్-ఏ బౌలర్లలో రవి బిష్ణోయ్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు కీలక వికెట్లు తీసుకున్నాడు. నమన్ ధీర్, ఖలీల్ అహ్మద్ చెరో రెండు వికెట్లు పడగొట్టి జట్టుకు విజయాన్ని ఖాయం చేశారు. మొత్తంగా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టి ప్రదర్శన కనబరిచిన భారత్-ఏ జట్టు వార్మప్ మ్యాచ్‌లో సత్తా చాటి టీ20 వరల్డ్‌కప్‌కు ముందు మంచి ఆత్మవిశ్వాసాన్ని సంపాదించింది. తిలక్ వర్మ రీ ఎంట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలవడం భారత అభిమానులకు ఉత్సాహాన్ని కలిగించింది.