Dhurandhar | ‘ఉరి: ద సర్జికల్ స్ట్రైక్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ప్రభంజనం సృష్టిస్తోంది. అయితే ఈ సినిమా సాధించిన అద్భుత విజయంతో పాటు, దీనిపై ‘ప్రోపగాండా’ విమర్శలు కూడా అంతే స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ వంటి వారు ఈ చిత్రంలోని రాజకీయ కోణాలను, వాస్తవ సంఘటనల చిత్రీకరణను విమర్శించగా, ఆదిత్య ధర్ వాటికి తనదైన శైలిలో గట్టి సమాధానమిచ్చారు.
దేశం పట్ల ప్రేమ, గుండెల్లో నిప్పు ఉన్న వ్యక్తులు భారతీయ సినిమాల్లో సరికొత్త చరిత్రను లిఖిస్తున్నారని, తమ దేశ ప్రజలకు ఒక గొప్ప కథను చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీశామని ఆయన స్పష్టం చేశారు. సినిమా విడుదలకు ముందు ‘కార్పొరేట్ బుకింగ్స్’ అంటూ తప్పుడు ప్రచారం చేసిన వారు సినిమా సాధించిన ‘ఆర్గానిక్’ సక్సెస్ చూసి ఇప్పుడు మౌనంగా ఉండిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. తన సినిమాను విమర్శించిన వారు ఆ విమర్శల ప్రవాహంలో కొట్టుకుపోయారని, కానీ ‘ధురంధర్’ ఒక సునామీలా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోందని ఆదిత్య అన్నారు. ఇక హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరోలు సినిమా మేకింగ్‌ను మెచ్చుకుంటూనే రాజకీయ అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పుడు, ఆదిత్య ధర్ ఎంతో హుందాగా స్పందించారు. అందరి అభిప్రాయాలను గౌరవిస్తామని పార్ట్-2లో అన్ని సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ చిత్రానికి సీక్వెల్‌ను 2026 మార్చి 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.