ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసిరింది. నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత పెరిగింది. ఇక్కడ అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న కారణంగా ప్రతి చలి కాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయి. ఉన్నట్టుండి వారం రోజులుగా గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. తాజాగా ఈ నెల 20న(శనివారం) కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యూ)లో 4.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, మంగళవారం సిర్పూర్(యూ) మండల కేంద్రంలో 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న జనవరి, ఫిబ్రవరి నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
– నిర్మల్, డిసెంబర్ 23(నమస్తే తెలంగాణ)

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజు రోజుకూ పెరుగుతున్న చలి తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 10 గంటలు దాటినా చలి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. దీనికి తోడు చలి గాలులు కూడా వీస్తుండడంతో పల్లె ప్రజలతో పాటు పట్టణ వాసులు ఉదయం, రాత్రి పూట బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళలో గ్రామాల్లో ఎక్కడ చూసినా చలి మంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు. ఉదయం కూరగాయల మార్కెట్‌కు వెళ్లే వారు, పాల వ్యాపారులు, పాఠశాలలకు వెళ్లే చిన్నారులు చలి కారణంగా అవస్థలు పడుతున్నారు.
ప్రస్తుతం యాసంగి పనులు ఊపందుకోవడంతో రైతులు, స్థానిక కూలీలతో పాటు వలస వచ్చిన వారు ఉదయం పూట చలికి భయపడి పనులకు వెళ్లలేక మధ్యాహ్న సమయంలో పనులు చేసుకుంటున్నారు. చలి తీవ్రతకు ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు శ్వాసకోశ సంబంధిత వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి పెరగడంతో ఉన్ని దుస్తులకు కూడా డిమాండ్ పెరిగింది. చలి నుంచి రక్షణకు ప్రజలు ఎగబడి కొంటున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు ఏమాత్రం కనిపించడం లేదు. దీంతో వాహనదారులు, ప్రయాణికులు భయం భయంగా రాకపోకలు సాగిస్తున్నారు.
చలి ప్రభావం ఎక్కువగా చిన్న పిల్లలు, వృద్ధులు, ఆస్తమా వ్యాధి గ్రస్తులపై ఉంటుంది. వీరు దగ్గు, శ్వాస కోశ వ్యాధుల బారిన పడే ముప్పు ఉంటుంది. అందుకే ఈ సీజన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరమైతే ఉన్ని దుస్తులు ధరించి బయటకు వెళ్లాలి. కాచి వడబోసిన నీటిని తాగాలి. అస్తమా వ్యాధిగ్రస్తులు దుమ్ము, ధూళి ప్రాంతాల్లో తిరగవద్దు. సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. చలి కారణంగా రోగ నిరోధక శక్తి తగ్గి సీజనల్, ఇతర వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్నందున విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
మాంసాహారాన్ని మితంగా తీసుకుంటూ ఎక్కువగా పండ్లు, కూరగాయలు, దుంపలు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు గుండె సంబంధిత వ్యాధులు కూడా అధికంగా వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో గుండెను సంరక్షించుకునేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా శరీరాన్ని సాధ్యమైనంత వరకు వేడిగా ఉంచుకోవాలి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటే మధ్య మధ్యలో కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. మంచినీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. గుండె సంబంధ వ్యాధులు ఉన్న వారు చలిలో తిరగకపోవడమే మంచిది.
-డా.జీ.రమేశ్, చిన్నపిల్లల వైద్యుడు, నిర్మల్
