నిర్మల్, ఆగస్టు 7(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలో రైస్ మిల్లర్ల చేతివాటం పతాకస్థాయికి చేరుకున్నది. సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ధాన్యం విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించినప్పటికీ కొంతమంది మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. 2024-25 వానకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి రైస్ మిల్లులకు కేటాయించిన సీఎంఆర్ ధాన్యం లెక్కలను తేల్చేందుకు పక్షం రోజులుగా జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. జిల్లా పౌర సరఫరాల శాఖ ఉత్నతాధికారులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బృందాలుగా ఏర్పడి రైస్‌మిల్లుల్లో ఫిజికల్ వేరిఫికేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఆయా మిల్లులకు కేటాయించిన ధాన్యం వివరాలతోపాటు ధాన్యాన్ని మిల్లింగ్ చేయగా నిల్వ ఉన్న బియ్యం వివరాలను పరిశీలించి నమోదు చేసుకుంటున్నారు.
జిల్లాలో ఇప్పటి వరకు 13 మిల్లులను తనిఖీ చేశారు. రెండు మిల్లుల్లో సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టినట్లు బుధవారం నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ బృందాల తనిఖీల్లో వెల్లడైంది. ముథోల్ మండలంలోని ముద్గల్ గ్రామంలో గల ఏషియన్ రైస్మిల్తోపాటు శ్రీ గణపతి మిల్లులో గత యాసంగిలో సీఎంఆర్ కోసం ఇచ్చిన ధాన్యం మాయమైనట్లు తేల్చారు. ఏషియన్ రైస్ మిల్లులో 1,78,000 బస్తాలు, శ్రీ గణపతి మిల్లులో 76 వేల ధాన్యం బస్తాలను అక్రమంగా తరలించినట్లు గుర్తించారు. దీని విలువ దాదాపు రూ.20 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఆయా మిల్లులను సీజ్ చేసిన అధికారులు యాజమాన్యంపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రెండు మిల్లులు కూడా పక్క జిల్లాకు చెందిన ఓ బడా వ్యాపారికి చెందినవిగా చెబుతున్నారు. స్థానికంగా గల బినామీ పేర్లపై ఈ మిల్లులను నడుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ముథోల్ మండలంలోని ముద్గల్ గ్రామంలో గల ఏషియన్ రైస్మిల్తోపాటు దాని సమీపంలో గల శ్రీ గణపతి మిల్లులో బుధవారం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆయా మిల్లుల్లో రెండు సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించారు. ఈ తనిఖీల్లో ఏషియన్ మిల్లులో 5,520 మెట్రిక్ టన్నులు, శ్రీ గణపతి రైస్‌మిల్లులో 3,040 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు అధికారులు తేల్చారు. దీని విలువ దాదాపు రూ.20 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. 2024-25 వానకాలం సీజన్లో ఏషియన్ మిల్లుకు సీఎంఆర్ కోసం 23,218 బస్తాలను కేటాయించారు. అలాగే ఇటీవల యాసంగి వడ్లను 1,15,453 బస్తాలను మిల్లింగ్ కోసం ఇచ్చారు.
మొత్తం రెండు సీజన్లకు కలిపి 1,38,671 బస్తాలను సీఎంఆర్ కోసం ఇవ్వగా, ఇప్పటి వరకు ఒక్క బస్తా కూడా మిల్లింగ్ చేయలేదని తెలుస్తున్నది. అధికారుల తనిఖీల్లో 1,38,000 పైగా బస్తాలు ఇక్కడి మిల్లు నుంచి అక్రమంగా తరలించినట్లు తేలింది. ఇదిలా ఉంటే శ్రీ గణపతి మిల్లుకు 2024-25 గత వానకాలం సీజన్లో 2,471 బస్తాలు, మొన్నటి యాసంగిలో 80,833 బస్తాల ధాన్యాన్ని సీఎంఆర్ కోసం కేటాయించారు. అయితే బుధవారం అధికారులు జరిపిన తనిఖీల్లో ఇక్కడి రైస్‌మిల్లులో కూడా 76 వేల బస్తాలు మాయమైనట్లు గుర్తించారు. ఈ రెండు రైస్‌మిల్లుల నుంచి సీఎంఆర్ కింద ఒక్క బస్తా కూడా ప్రభుత్వానికి తిరిగి రాలేదని సమాచారం.
నిర్మల్ జిల్లాతోపాటు పక్కనే గల నిజామాబాద్ జిల్లాకు చెందిన కొందరు బడా వ్యాపారులు అక్రమాల కోసమే కొత్తగా రైస్ మిల్లులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బుధవారం నిర్వహించిన తనిఖీల్లో పెద్ద ఎత్తున ధాన్యాన్ని పక్కదారి పట్టించిన ముథోల్ మండలంలోని ఈ రెండు రైస్ మిల్లులను కూడా ఇటీవలే కొత్తగా ఏర్పాటు చేశారు. సీఎంఆర్ ధాన్యం కేటాయింపులో గల లొసుగులపై పూర్తిస్థాయిలో అవగాహన ఉన్న సదరు యాజమాన్యం.. ధాన్యం డబ్బులను దండుకునేందుకే కొత్తగా మిల్లులను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. మిల్లులను ఏర్పాటు చేసి ఏడాది కూడా పూర్తి కాకముందే ఇంత పెద్ద ఎత్తున ధాన్యాన్ని తరలించడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. దాదాపు రెండు నుంచి మూడు కోట్లు పెట్టుబడి పెట్టి మిల్లులను ఏర్పాటు చేస్తున్న వ్యాపారులు.. సీఎంఆర్ ధాన్యాన్ని తీసుకుని బియ్యాన్ని ఇవ్వకుండా ప్రభుత్వానికి కోట్ల రూపాయలను ఎగవేస్తున్నారు.
అధికారులు సదరు మిల్లును సీజ్ చేసినా దాని యజమానులు పెద్దగా పట్టించుకోవడం లేదు. మిల్లు విలువ కంటే తరలించిన ధాన్యం విలువ పదింతలు ఉండడంతో ఈ అక్రమ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నది. నాలుగేళ్లుగా జిల్లాలోని కొంతమంది మిల్లర్లు పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడుతున్నప్పటికీ వారిపై నామమాత్రపు చర్యలే తప్ప కఠిన చర్యలు లేకపోవడంతో అక్రమాలకు మరింత ఆస్కారమిస్తున్నదని చెబుతున్నారు. ఇటీవల సీఎంఆర్ విషయంలో అవకతవకలకు పాల్పడిన కొన్ని రైస్‌మిల్లులపై కేసులు నమోదు చేసినప్పటికీ పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదు.
జిల్లాలో కొత్తగా రోజుకో రైస్‌మిల్ పుట్టుకొస్తూనే ఉన్నది. వాస్తవానికి ప్రతి సీజన్లో రైస్ మిల్లులకు సీఎంఆర్ ధాన్యం కేటాయించేటప్పుడు 10 శాతం బ్యాంకు గ్యారెంటీ తీసుకోవాలనే నిబంధన ఉన్నది. సంబంధిత అధికారులు అవేమి పట్టించుకోకుండా కొత్తగా ఏర్పాటు చేసిన మిల్లులకు ధాన్యాన్ని కేటాయించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది అధికారులు మిల్లర్లతో అంటకాగడం వల్లనే వారు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలోని అన్ని రైస్‌మిల్లుల్లో అధికారులు, టాస్క్‌ఫోర్స్ బృందాలు దశలవారీగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా బుధవారం ముథోల్ మండలంలోని ఏషియన్, శ్రీ గణపతి రైస్‌మిల్లుల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ రెండు మిల్లుల్లో కూడా సీఎంఆర్ కోసం కేటాయించిన ధాన్యం లేనట్లు గుర్తించారు. ఆయా మిల్లుల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు బుక్ చేసి, వారి ఆస్తులను సీజ్ చేస్తాం. సీఎంఆర్ ధాన్యం విషయంలో అక్రమాలకు పాల్పడినవారిపై కఠినంగా వ్యవహిస్తాం. మిల్లర్లు నిర్ధేశించిన గడువులోగా ప్రభుత్వానికి సీఎంఆర్ బియ్యాన్ని అందజేసి సహకరించాలి.
– ఎల్.కిశోర్‌కుమార్, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్, నిర్మల్